రేపు హైదరాబాద్ లో ఓటరు నమోదు

రేపు హైదరాబాద్ లో ఓటరు నమోదు

 హైదరాబాద్‌, వెలుగు: ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లోఈ నెల 3 ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 వరకు మరోసారి ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు. శుక్రవారం ఓటర్ల జాబితా సవరణపై హైదరాబాద్ జిల్లా ఓటర్ల నమోదు పర్యవేక్షణ అధికారులతో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పోలింగ్ లోకేషన్లలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. 2018 డిసెంబర్ 26న ఓటర్ల జాబితా ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని.. ఇందులో సవరణలు, అడ్రస్ మార్పు , 18 ఏళ్లు నిండిన వారికి ఓటరు నమోదుకి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో బీఎల్ వోలు ఫామ్ 6,7,8,8ఏతో పాటు ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచుతారన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి సలహాలు, సూచనలు, సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌ 1950 కు ఫోన్ చేయాలన్నారు. 1950 టో ల్ ఫ్రీ నంబర్ ను ఆయన ప్రారంభించారు. తర్వాత ఈ నంబర్ కి వచ్చిన కాల్స్ ను దాన కిశోర్ స్వీకరించి వారితో మాట్లాడారు. ప్రజలు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. అడిషనల్‌ కమిషనర్లు  అమ్రపాలి కాట, ముషారఫ్ అలీ, జయరాజ్‌ కెన్నెడి పాల్గొన్నారు.