
- 30కి పైగా క్రీడల్లో శిక్షణ
- సాధారణ రోజుల్లో రోజూ 4 వేల మందికి ట్రైనింగ్
- సమ్మర్లో 50 వేలకు పైనే..ఒక్క రెగ్యులర్ కోచ్ కూడా లేడు
- ప్రపోజల్స్ పంపినా స్పందించని గత సర్కారు
- 150 మంది కోసం ప్రస్తుత సర్కారుకు త్వరలో ప్రపోజల్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగంలో కోచ్‌ల కొరత తీవ్రంగా ఉంది. క్రీడలపై ఆసక్తి ఉన్నవారు పూర్తి స్థాయి క్రీడాకారుడిగా మారాలంటే కోచ్‌ల అవసరం ఎంతో ఉంటుంది. అయితే, సుమారు కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్లో జీహెచ్ఎంసీ రన్చేస్తున్న ప్లే గ్రౌండ్స్‌లో పూర్థిస్థాయి కోచ్‌లు లేరు. కేవలం పార్ట్‌టైం కోచ్‌లతో నెట్టుకు వస్తుండడంతో ఈ ప్రభావం క్రీడాకారులపై పడుతోంది.
సమ్మర్లో 50 వేల మందికి శిక్షణ
గ్రేటర్ లో 521 ప్లే గ్రౌండ్స్ ఉండగా.. ఎల్బీనగర్ లో 10, ఖైరతాబాద్ లో 20, చార్మినార్ లో 31, శేరిలింగంపల్లి , కూకట్‌పల్లి జోన్లలో 19, సికింద్రాబాద్ లో 17 కలిపి 97 ఇండోర్, ఔట్డోర్మైదానాల్లో బల్దియా ట్రైనింగ్ఇస్తోంది. సమ్మర్ మినహా మిగతా రోజుల్లో 4 వేల మంది శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఏటా ఏప్రిల్ లో నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపుల టైంలో 357 గ్రౌండ్స్ వాడుకుంటోంది. ఇందులో 915 సెంటర్లు ఏర్పాటు చేసి సుమారు 50 వేల మందికి శిక్షణ ఇస్తోంది. నేషనల్ గేమ్ హాకీ కోసం నాలుగు, కబడ్డీకి నాలుగు గ్రౌండ్స్కేటాయించింది. బాక్సింగ్ రింగ్ పనులు నడుస్తున్నాయి. బల్దియా క్రీడా మైదానాల్లో శిక్షణ తీసుకోవాలి అనుకునేవారు జీహెచ్ఎంసీ స్పోర్ట్ విభాగంలో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ ఇచ్చినందుకు క్రీడలను బట్టి మినిమం రూ.50 నుంచి మ్యాగ్జిమమ్రూ.1000 వరకు తీసుకుంటోంది.
71 మందితోనే సరి..
బల్దియా నుంచి స్పోర్ట్స్ఇన్స్పెక్టర్లు, పీసీసీల పేరుతో సుమారు 71 మంది పార్ట్‌టైం కోచ్‌లు ఉన్నారు. కానీ, ఒక్క పర్మినెంట్ కోచ్ కూడా లేరు. పార్ట్ టైం కోచ్‌లు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోచింగ్ఇస్తున్నారు. వీరికి నెలకి రూ.11,300 వేతనాలు ఇస్తోంది. వీరి సంఖ్య తక్కువగా ఉండడంతో పూర్థి స్థాయిలో శిక్షణ అందించలేకపోతున్నారు. దీంతో చాలా గ్రౌండ్స్‌లో ఎవరి ఆటలు వారే ఆడుకుని పోతున్నారు.
సమ్మర్లో మాత్రం సుమారు అరలక్ష మంది వస్తుండడంతో వారి కోసం హనరరీ కోచ్ ల పేరుతో 800 మందిని తీసుకుంటోంది. ప్రతిసారి ఈ సమస్య కొనసాగుతుండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి బల్దియా 134 మంది రెగ్యులర్కోచ్లు కావాలంటూ మూడుసార్లు ప్రపోజల్స్పంపింది. అయినా, వారి నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు మళ్లీ సమ్మర్‌క్యాంపులు మొదలుపెట్టే టైం రావడంతో కోచ్‌ల అవసరం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం 150 మంది రెగ్యులర్కోచ్లు కావాలంటూ వారంలో ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబోతోంది.
ట్రైనింగ్ఇచ్చే క్రీడలివే..
జీహెచ్ఎంసీ 30 కిపైగా స్పోర్ట్స్అండ్గేమ్స్ కి శిక్షణ ఇస్తోంది. ఇందులో క్రికెట్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్ బాల్,బాక్సింగ్,సైక్లింగ్,ఫుట్ బాల్,హ్యాండ్ బాల్, హాకీ, కిక్ బాక్సింగ్, కోర్ఫ్ బాల్, రోలర్ స్కేటింగ్, తైక్వాండో, టెన్నిస్, వుషు, బాడీ బిల్డింగ్, క్యారమ్, చెస్, ఫెన్సింగ్,జిమ్, జిమ్నాస్టిక్స్, జూడో, కరాటే, సెపాక్ తక్రా, షటిల్ బ్యాడ్మింటన్, స్కేటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీ బాల్, రెజ్లింగ్, యోగా ఉన్నాయి.