- గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా పోగైన చెత్త
- హుస్సేన్‌సాగర్ లోంచి 6, 226 టన్నుల వ్యర్థాలు వెలికితీత
- రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్న జీహెచ్ఎంసీ సిబ్బంది
హైదరాబాద్ సిటీ, వెలుగు : గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో పోగుపడిన వ్యర్థాలను జీహెచ్ ఎంసీ సిబ్బంది తొలగించారు. మొత్తం 713 వెహికిల్స్ లో వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించారు. నిమజ్జనం అయిన మరుసటి రోజు బుధవారం ఒక్కరోజులోనే అత్యధికంగా 9,145.08 టన్నుల చెత్తను తొలగించారు. అంతకు ముందు మంగళవారం 8,542 టన్నుల వ్యర్థాలను తొలిగించారు.
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరిగిన 11 రోజులపాటు సగటున 8,130 టన్నుల చెత్త వెలువడింది. ఇందులో ఎక్కువగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు వెలువడ్డాయి. సాధారణ సమయంలో డైలీ సగటున 6 వేల టన్నులు మాత్రమే వెలువడేది. నిమజ్జనం సమయంలో ఏర్పడిన వ్యర్థాల్లో పేపర్ ప్లేట్లు, పూజాసామగ్రి, అలంకరణ వస్తువులే ఎక్కువగా ఉన్నాయి. చెత్తను తొలగించేందుకు 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేశారు.
వ్యర్థాలను తొలగిస్తున్న హెచ్ఎండీఏ
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం తర్వాత వ్యర్థాలను రెండ్రోజులుగా వెలికి తీసి డంపింగ్ యార్డులకు పంపుతున్నారు. బుధవారం వరకు 5,500 టన్నుల వ్యర్థాలు తొలగించారు. గురువారం సాయంత్రం వరకు మరో 726 టన్నుల వ్యర్థాలు తొలగించారు. తొలగించిన వ్యర్థాలను లోయర్ ట్యాంక్ బండ్ లోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించారు. ఇప్పటి వరకు మొత్తం 6,226 టన్నుల తరలించారు. మరో ఐదు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికితీయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.