
- హెచ్ సిటీ పనులపై చర్చించిన సభ్యులు
- కేబీఆర్ పార్కు చుట్టూ ఆస్తుల సేకరణకు అనుమతికి సిఫార్సు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది.15 అంశాలతోపాటు 6 టేబుల్ ఐటమ్స్ కు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానంగా హెచ్సిటీ పనుల్లో భాగంగా కేబీఆర్ పార్కు, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద మూడు చోట్ల రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం 18 ఆస్తుల సేకరణకు, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 47 ఆస్తుల సేకరణ, కేబీఆర్ పార్కు ముగ్దా జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ, మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం 40 ఆస్తుల సేకరణకు ప్రభుత్వ అనుమతి కోసం సిఫార్సు చేసింది.
ట్రిపుల్ఐటీ జంక్షన్ లో మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 21 ఆస్తులు, ఖాజాగూడ జంక్షన్ వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 10 ఆస్తులు, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా రోడ్ నెం.82 నుండి ఫిల్మ్ నగర్ మీదుగా ఏబీఎన్ రోడ్డు వరకు 24 మీటర్ల రోడ్డు వెడల్పునకు13 ఆస్తుల సేకరణకు ఆమోదం తెలిపారు. బండ్లగూడ మండలం కందికల్ లో మిధాని బస్‌స్టేషన్, బస్ డిపో నిర్మాణం కోసం ఆర్టీసీకి కేటాయించిన 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికిఎన్ఓసీ జారీ చేసేందుకు జీహెచ్ఎంసీకి సిఫార్సు చేస్తూ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.
బుద్ధ భవన్ లో నాలుగో అంతస్తు ఏ బ్లాక్ లోని తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లీజు వ్యవధి రెండేండ్లు పొడిగించడంతోపాటు అద్దె పెంపునకు ఓకే చెప్పారు. వీటితోపాటు మరిన్ని అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆరు టేబుల్ ఐటమ్స్ లో ముఖ్యంగా దారుస్సలాం నుంచి చాక్నావాడి కల్వర్ట్ వరకు ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.7.40కోట్ల అంచనాతో ఓకే చెప్పారు. అనుమతి కోసం ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
స్పోర్ట్స్, ఎస్టేట్స్ విభాగాలపై మేయర్ ఆగ్రహం
స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్ కి సంబంధించి స్లాట్లను బుక్ చేసి రెట్టింపు రేట్లకు విక్రయిస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. స్లాట్ల విషయంలో గోల్ మాల్ జరిగినా పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఆస్తులకి సంబంధించిన అద్దెలు ఎందుకు కలెక్ట్ చేయడంలేదని ఎస్టేట్స్విభాగం అధికారులను నిలదీశారు. వచ్చే ఆదాయాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారని మండిపడ్డారు.