ఈసారి ఏకగ్రీవం కష్టమే .. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్

ఈసారి ఏకగ్రీవం కష్టమే .. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్
  • 10 నుంచి 17 వరకు నామినేషన్లు
  • 18న నామినేషన్ల పరిశీలన 
  • 21 వరకు ఉపసంహరణకు గడువు 
  • 25న ఎన్నికలు..  అదే రోజు ఫలితాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి1న ప్రస్తుత స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మొత్తం 15 మంది సభ్యుల కోసం ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 

తర్వాత పోటీలో ఉండే వారి ఫైనల్ లిస్ట్​ను అధికారులు ప్రకటిస్తారు. 15 మందికి మించి పోటీ పడితే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అదే జరిగితే 25న స్టాండింగ్​ కమిటీని ఎన్నుకునేందుకు బల్దియా హెడ్డాఫీసులో ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కౌంటింగ్​ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. కౌన్సిల్​లో పార్టీల బలాబలాలు మారడంతో ఈసారి స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. గతంలో ఎంఐఎం నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి 8 మంది సభ్యులతో స్టాండింగ్​కమిటీని ఎన్నుకున్నారు. ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్​మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 

ఏడాది కాలపరిమితి ఉండే స్టాండింగ్ కమిటీలో గత మూడు సార్లు బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులే ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓడిపోయాక, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి అధికార కాంగ్రెస్ లో చేరారు. వారితోపాటు పలువురు పార్టీ మారారు. ఇప్పుడు పరిస్థితి గతంలో మాదిరిగా లేదు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులను మేయర్ సభ నుంచి బయటకు పంపించారు. దీంతో వారంతా మేయర్ చర్యలపై గుర్రుగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మేయర్​చర్యలను తప్పుబట్టారు. మేయర్ తీరు మారకుంటే అవిశ్వాసం పెట్టేందుకు వెనుకాడబోమని బీఆర్ఎస్​కార్పొరేటర్లు ప్రకటించారు.

పోటీలో అన్ని పార్టీలు?

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ జరగని ఎన్నికలు అనివార్యం అయ్యేలా ఉన్నాయి. 15 మంది సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక కష్టంగానే ఉంది. అన్నిపార్టీలు తమ ప్రాతినిధ్యం కోసం పోటీ పడేలా ఉన్నాయి. గ్రేటర్ లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 39 మంది బీజేపీ,  42 మంది బీఆర్ఎస్, 24 మంది కాంగ్రెస్, 41 మంది ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు.  

15 మందితో కూడిన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోవాలంటే 74 మంది కార్పొరేటర్లు ఏకపక్షంగా ఉండాలి.  ఒక సభ్యుడు 15 మందికి ఓటు వేసే అవకాశముంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్​కు ఎంఐఎం సపోర్టు చేసే అవకాశమున్నప్పటికీ ఇరు పార్టీల బలం 65 మందే అవుతున్నారు. నామినేషన్ల గడువు ముగిసే నాటికి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.