13 అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్

 13 అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 13 అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలకు జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన గురువారం (జనవరి 23) జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్‎లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై సుధీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 13 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సిటీలో ఉన్న నాళాల డీ సీల్టింగ్ పనులకు స్టాండింగ్ కమిటీ పచ్చ జెండా ఊపింది.

అలాగే.. జూ పార్క్-ఆరాంఘర్ ఫ్లై ఓవర్‎కు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రెస్ వేగా నామకరణం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి  కూడా ఆమోదం లభించింది. కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో CSR పద్ధతిలో గ్రీనరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. సీఆర్ఎంపీ ఫేజ్1 కింద చేపట్టిన పనులకు కొనసాగింపుగా.. ఫేజ్- 2 కింద చేపట్టాల్సిన 744 కిలోమీటర్ల రోడ్డు నిర్వహణ  ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేందుకు స్టాండింగ్ కమిటీ ఒకే చెప్పింది.

హెచ్-సీటీ ప్రాజెక్టు కింద సిటీలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలకు రూ.7,032 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ప్రభుత్వ ఆమోదం కోసం సిఫారసులు పంపాలని నిర్ణయించింది. అలాగే.. నారాయణగూడలో ఓల్డ్ మున్సిపల్ మార్కెట్ స్థలంలో నిర్మించిన మోడల్ మార్కెట్ భవన నిర్మాణంలో చేసిన మార్పులకు కమిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా సిటీలో పలు రోడ్ల విస్తరణకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

జనవరి 30న కౌన్సిల్ మీటింగ్..

ఇదిలా ఉండగా.. ఈ నెల (జనవరి) 30 జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న కౌన్సిల్ మీటింగ్‎లో గ్రేటర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ జీహెచ్ఎంసీ బడ్జెట్‎ను మేయర్ విజయలక్ష్మీ కౌన్సిల్‎లో ప్రవేశపెట్టనున్నారు.  

2025-26 ఆర్థిక సంవత్సరానికి  రూ.8,440  కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను ఇప్పటికే GHMC స్టాండింగ్ కమిటీ ఆమోదించిన విషయం తెలిసిందే. అలాగే.. ప్రజా సమస్యలపై కౌన్సిల్‎లో చర్చ జరగనుంది. దీంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్‎లపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోన్న నేపథ్యంలో ఈ కౌన్సిల్ మీటింగ్ హాట్ హాట్ సాగుతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.