జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.8,440 కోట్లు.. 2025 – 26 బడ్జెట్ ఆమోదించిన స్టాండింగ్​ కమిటీ

జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.8,440 కోట్లు.. 2025 – 26 బడ్జెట్ ఆమోదించిన స్టాండింగ్​ కమిటీ
  • రెవెన్యూ ద్వారా రూ.4,445 కోట్ల ఆదాయం 
  • ఇందులో రూ.4 వేల కోట్లు ఖ‌‌ర్చు చేయాలని నిర్ణయం 
  • హౌసింగ్ కోసం రూ.300 కోట్లు కేటాయింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌‌డ్జెట్​కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. రూ.8,440 కోట్లతో బడ్జెట్ రూపొందించగా సోమవారం ఆమోదించింది. 2024–-25లో రూ.7,937 కోట్లతో బడ్జెట్​ను ఆమోదించగా, తర్వాత రూ.8,118 కోట్లకు సవరించారు. తొలుత వచ్చే ఏడాదికి సంబంధించిన బడ్జెట్​ ప్రతిపాదనలను నవంబర్ చివరి వారంలో స్టాండింగ్ కమిటీ ముందు ఉంచగా, సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్పులు చేయాలంటూ తిరస్కరించారు.

అధికారులు ప్రతిపాదనల్లో మార్పులు చేసి మరోసారి స్టాండింగ్ కమిటీ ముందు పెట్టారు. సోమవారం స్టాండింగ్ కమిటీ సభ్యులు చర్చించి ఆమోదించారు. రూ.8,440 కోట్లతో పెట్టిన బడ్జెట్​కు ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండానే ఆమోదించారు. హౌసింగ్ కోసం రూ.300 కోట్లు కేటాయించారు. రూ.140 కోట్లు 15వ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎన్ క్యాప్ గ్రాండ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆమోదించిన మొత్తం 2024–-25తో పోలిస్తే రూ.503 కోట్లు అధికం.   

రెవెన్యూ మిగులు రూ.445 కోట్లు 
రెవెన్యూ ద్వారా రూ.4,445 కోట్ల ఆదాయం వ‌‌స్తుంద‌‌ని, దాంట్లో రూ.4000 వేల  కోట్లు ఖ‌‌ర్చు చేయాలని స్టాండింగ్​కమిటీ నిర్ణయించింది. రెవెన్యూ మిగులు రూ.445 కోట్లు ఉంటుంద‌‌ని అంచ‌‌నా వేశారు. క్యాపిట‌‌ల్ రాబ‌‌డి రూ.4,440 కోట్లు ఉంటుందని, దీన్ని పూర్తిగా ఖర్చు చేయాలని నిర్ణయించారు. రోడ్డు డెవలప్​మెంట్ ప్రాజెక్టు, బ్రిడ్జి నిర్మాణం, సీఆర్ఎంపీ, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన హెచ్ సిటీ(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్) పనుల కోసం రూ.1,690 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించారు.

సాలిడ్ వెస్ట్​మేనేజ్​మెంట్​ కోసం రూ.687 కోట్లు, నాలాల అభివృద్ధి కోసం  రూ.408 కోట్లు ఖర్చు చేసేలా అంచనాలు రూపొందించారు. గ్రీన్ బడ్జెట్ కోసం రూ.344 కోట్లు, అప్పులు తీర్చేందుకు రూ.1,252 కోట్లు కేటాయించారు. బల్దియా బడ్జెట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు సమకూరుతాయని ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ గ్రాంట్ల రూపంలో రూ.3 వేల కోట్లు ఇస్తుందని, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.279 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఏడాది రూ.700 కోట్ల అప్పులు చేయడం ద్వారా బడ్జెట్ కు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. 

ALSO READ : ఆర్టీసీకి సంక్రాంతి రష్ .. ఏపీకి ఆన్​లైన్​లో రిజర్వేషన్లు ఫుల్​

ఆలస్యంగా ఆమోదం
జీహెచ్ఎంసీ పాలకమండలి చేసే ఖర్చుకు సంబంధించిన బడ్జెట్ రూపకల్పన ప్రతి ఏటా నవంబర్ నుంచే ప్రారంభమవుతుంది. అధికారులు రూపొందించిన బడ్జెట్ నవంబర్ 10లోగా బల్దియా స్టాండింగ్​కమిటీ ముందు పెట్టాలి. కానీ, ఈసారి 20 రోజులు ఆలస్యమైంది. బడ్జెట్ స్టడీ చేసిన కమిటీ డిసెంబర్ 10లోపు కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. 15వ తేదీ లోపు పాలక మండలి ముందుంచాలి. కానీ ఈసారి 13 రోజులు ఆలస్యంగా బడ్జెట్ కు ఆమోదం తెలిపింది స్టాండింగ్ కమిటీ. ఇక పాలక మండలి ఎప్పుడు ఆమోదం తెలుపుతుందో చూడాలి.