![ఇయ్యాల్టి ( ఫిబ్రవరి 10) నుంచే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్లు](https://static.v6velugu.com/uploads/2025/02/ghmc-standing-committee-nominations-starts-from-today_T2nSF4MJZs.jpg)
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సోమవారం నుంచి ఈ నెల 17 వరకు బల్దియా హెడ్డాఫీస్లో అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు.18న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల ఫైనల్ జాబితాను ప్రకటిస్తారు. గ్రేటర్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండగా, అందులో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మిగిలిన 146 మందిలో ప్రస్తుతం 39 బీజేపీ, బీఆర్ఎస్ 42, కాంగ్రెస్ 24, ఎంఐఎం నుంచి 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
మొత్తం15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలంటే 74 మంది కార్పొరేటర్లు ఏకపక్షంగా ఉండాల్సి ఉంది. ఒక సభ్యుడికి 15 మందికి ఓటు వేసే అవకాశముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క పార్టీ కూడా సింగిల్ గా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరో పక్కన ఎవరు ఏ పార్టీకి మద్దతిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇందుకు సంబంధించి ఆయా పార్టీల పెద్దలతో కార్పొరేటర్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం బీజేపీ కార్పొరేటర్లతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో కలవబోమని చెప్పారు. స్టాండింగ్ కమిటీలో పోటీకి సంబంధించి మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నేడో, రేపో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లతో ఆయా పార్టీల పెద్దలు సమావేశం కానున్నారు.