- సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు నామ్‌కే వాస్తే!
- రిజిస్ట్రేషన్లతో సరిపెడుతున్న బల్దియా అధికారులు
‘‘సరూర్‌నగర్‌కు చెందిన విషిత గత నెల 28న సమ్మర్ కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాడ్మింటన్ గేమ్‌ను ఎంచుకుంది. బల్దియా అధికారులు ఆమెకు సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్‌లో కోచింగ్ తీసుకోవచ్చని అప్లికేషన్ ఐడీ(9000012736) నంబర్కేటాయించారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.50 తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రెండ్రోజుల తర్వాత కోచింగ్ కోసమని విషిత విక్టోరియా మెమోరియల్ హోమ్ దగ్గరికి వెళ్లగా అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. వరుసగా రెండు రోజులు ఇదే పరిస్థితి నెలకొంది. బాలిక తల్లిదండ్రులు సంబంధిత అధికారికి ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదని విషిత తల్లిదండ్రులు చెబుతున్నారు.’’
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు నామమాత్రంగా సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ సెంటర్లలో కోచింగ్ ఇచ్చేవారు కరువయ్యారు. ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న పిల్లలు ఆయా సెంటర్లకు వెళ్తే అక్కడ ఎవరూ ఉండడం లేదు. అసలు కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారా లేదా అన్నట్లు ఉంటోంది అక్కడి పరిస్థితి. 37 రోజులపాటు నిర్వహించాల్సిన సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో ఇప్పటికే వారం ముగిసింది. అన్ని జోన్లలో అట్టహాసంగా ప్రారంభించనప్పటికీ కోచింగ్‌పై అధికా రులు దృష్టి పెట్టడం లేదు. గత నెల 25న క్యాంపులు స్టార్ట్ కాగా ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉంది. మొత్తం 353 ప్లే గ్రౌండ్లలో 915 కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు, 44 రకాల క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు 712 మంది హానరరీ కోచ్‌లను నియమించినట్లు అధికారులు చెప్పారు. కానీ క్యాంపుల వద్ద ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. జీహెచ్ఎంసీ తీరుపై పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఏడాది ఒక్కసారి ఏర్పాటు చేసే క్యాంపులను సక్రమంగా నిర్వహించలేరా అని ప్రశ్నిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పించనప్పుడు క్యాంప్‌లు పెట్టడం దేనికి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు పట్టించుకోకనే..
కాలనీలు, బస్తీల్లో గ్రౌండ్లు లేక ఇప్పటికే పిల్లలు క్రీడలకు దూరమవుతున్నారు. ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు కూడా శిక్షణ లేక వెనకబడుతున్నారు. అలాంటివారికి బల్దియా సమ్మర్‌క్యాంప్‌లు ఎంతో ఉపయోగపడతాయని అనుకున్నప్పటికీ నిర్వహణ సరిగ్గా లేదు. బల్దియా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారెందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో బల్దియా సమ్మర్ క్యాంప్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. గతంలో నేషనల్, ఇంటర్నేషనల్, సీనియర్ కోచ్‌లతో శిక్షణ ఇచ్చేవారు. ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులను ఎంపిక చేసి స్టేట్, నేషనల్ లెవెల్పోటీలకు పంపించేవారు. కొన్నేండ్లుగా ఆ పరిస్థితి ఉండడం లేదు. బల్దియా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమ్మర్ క్యాంప్‌లు నామ్ కే వాస్తేగా మారాయి.
20 వేల మందికి ఏర్పాట్లన్నరు
సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ల్లో 20 వేల మందికి కోచింగ్ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేసిందని అధికారులు తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కలిపి కేవలం 3,800 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అవగాహన కల్పించి క్యాంపుల్లో జాయిన్ అయ్యేలా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. వానలను కారణంగా చూపిస్తూ దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే కనీసం ఇండోర్ గేమ్స్ కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.