సూపర్వైజర్ల జబర్దస్త్
జీతమిచ్చినందుకు రూ.500 ఇవ్వాల్సిందే
సఫాయి కార్మికుల దగ్గర వసూళ్లు
ఏటా రూ.12 కోట్ల దోపిడీ
హైదరాబాద్, వెలుగు: రోడ్లు ఊడ్చి.. మురుగు కాల్వల్లో నుంచి చెత్త ఎత్తిపోసే సఫాయి కార్మికుల నుంచి కొంతమంది బల్దియా పారిశుద్ధ్య విభాగం సూపర్‌వైజర్లు జబర్దస్త్గా పైసలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.500 తీసుకుంటున్నారు. 18,382 మంది పారిశుద్ధ్య కార్మికుల నుంచి నెలకు 91లక్షలు, ఏడాదికి రూ.12 కోట్ల మేర దోపిడీ జరుగుతోంది. పైసలియ్యకుంటే అటెండెన్స్ వేయరన్న భయంతో కార్మికులు జీతం రాగానే నెలనెలా పైసలు ముట్టజెప్తున్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. ఒక్క రోజు డ్యూటీకి పోకపోతే జీతం కట్ అవుతుంది. నిత్యం చెత్త, మురికిని తొలగిస్తూ సిటీని శుభ్రం చేసే స్వచ్ఛ దూతలు. ముఖ్యమంత్రి నుంచి మేయర్ వరకు, కమిషనర్ నుంచి కార్పొరేటర్ వరకు అందరూ కార్మికుల పనితీరును ప్రశంసిస్తారు. పారిశుధ్య కార్మికుల వల్లే సిటీ అందంగా ఉందంటూ కీర్తిస్తారు. కానీ అలాంటి కష్టజీవులు దోపిడీకి గురవుతుంటే ఏ పెద్దలూ స్పందించడం లేదు. ఏళ్ల తరబడి దోపిడీని సహిస్తూ.. భరిస్తూ జీవనం సాగిస్తున్నారు. జీతం చేతికి రాగానే సూపర్ వైజర్లు ప్రత్యక్షమై జబర్దస్తీగా వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే ఎక్కడ అటెండెన్స్ వేయరో అనే ఆందోళనతో కార్మికులు భయపడుతున్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం కావడంతో అవగాహన లేక గుడ్డిగా నమ్ముతున్నారు. ఎవరైనా కదిలిస్తే కష్టాన్ని వెళ్లబోసుకుంటున్నారు. ఒంట్లో బాగాలేకున్నా కష్టపడి డ్యూటీకి వచ్చిన ఓ పెద్దావిడను కదిలిస్తే తన ఆవేదనను వెల్లడించింది. కంప్లయింట్ చెయ్యొచ్చు కదమ్మా అంటే ” ఏమో సార్.. మేమిచ్చే పైసలు పైదాకా పోతాయంటున్నరు.. మేం కంప్లయింట్ ఇస్తే మా పొట్టగొడతారని భయమైతాంది. ఏం చేస్తాం నెలకు రూ.500 ఇస్తున్నం. మా కష్టం ఎవరికి చెప్పుకోవాలె బిడ్డా” అంటోంది.
అంతటా నడుస్తోంది..!
సిటీలో ఎక్కడ చూసినా పారిశుధ్య కార్మికులది ఒకే కష్టం. కార్మికుల నుంచి శానిటరీ సూపర్‌వైజర్లు నెలకు రూ.500 వసూలు చేస్తున్నారు. ఇది తక్కువ మొత్తమే అనిపిస్తున్నా పేద ప్రజలకు ఐదు వందలంటే ఓ రోజు కష్టం. చెత్తతో సావాసం చేస్తూ చెమటోడ్చితే కానీ చేతికి రాని సంపాదన. ఐదు రోజుల భోజనం ఖర్చు. నెలకు సరిపడా మందులు. ఆరోగ్యం బాలేకపోతే దవాఖానా ఖర్చులు. ఒక్క ఐదు వందల రూపాయలుంటే చాలీచాలని జీతం కలిగిన పేదవాళ్లకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ ఎన్ని అవసరాలున్నప్పటికీ నెలనెలా పుట్టమీద పెట్టినట్టే సూపర్ వైజర్లకు పైసలు సమర్పించుకోవాల్సి వస్తోంది. పారిశుధ్య కార్మికులు నెల నెలా జీతం రాగానే రూ.500 సూపర్ వైజర్‌లకు ఇస్తేనే సక్రమంగా పని చేయనిస్తారు. లేదంటే పనికి కొర్రీలు పెడుతూ వేధిస్తారు. ” మీరిచ్చే ఐదు వందలు నేనొక్కడినే తింటానా… మేడమ్‌కు ఇవ్వాలి, సార్‌కు ఇవ్వాలి” అంటూ దబాయిస్తారు. మేడమ్, సార్ అంటే హెల్త్ ఆఫీసర్లు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా కార్మికుల కష్టాన్ని కూడా దోచుకోకపోతే వారికి సంతృప్తి ఉండదు. సిటీలో ఏ ఏరియాలో అయినా కూడా ఇదే పరిస్థితి. నెల తిరగ్గానే వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వసూల్ సంప్రదాయాన్ని సూపర్ వైజర్లు వ్యవస్థీకృతం చేసేశారు.
ఏడాదికి రూ.12 కోట్లు దోపిడీ
జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు, అవుట్ సోర్స్ పద్ధతిలో చెమటోడ్చి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని అధికారులు గుర్తించడం లేదు. శానిటరీ సూపర్ వైజర్లపై నిఘా పెట్టి పట్టుకుంటే అవినీతిని అరికట్టే అవకాశం ఉన్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. వివిధ సందర్భాల్లో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు కష్టాలు చెప్పుకున్నప్పటికీ అధికారుల మనసు కరగడం లేదు. నిఘా పెట్టి అవినీతి సూపర్ వైజర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సినప్పటికీ పట్టించుకోవడం లేదు. సిటీలో 18,382 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరికి సంబంధించిన హాజరు నమోదు, విధి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను 948 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు చూస్తారు. వీరికి సర్కిల్ లెవల్‌లోని హెల్త్ ఆఫీసర్లు నేతృత్వం వహిస్తుంటారు. 18,382 మంది నుంచి రూ.500 అంటే నెలకు అక్షరాలా 91 లక్షల 91 వేలు. సుమారు కోటి రూపాయలు. ఏడాదికి రూ.12 కోట్లు. ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అధికారులే దిగమింగుతున్నారు. కొందరు హెడ్డాఫీసు లెవల్‌లోనూ కమీషన్లు తీసుకోవడం వల్లే చూసీ చూడనట్టు ఉంటున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.