- ఎత్తిన చెత్తను డైరెక్ట్ ట్రక్‌లో వేసి డంపింగ్ యార్డు పంపించొచ్చు
- ఐమ్యాక్స్ వద్ద పరిశీలించిన అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో చెత్తను క్లీన్ చేసేందుకు జీహెచ్ఎంసీ కొత్త మెషీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. రోడ్డుపై వేస్తున్న పేపర్ షాట్స్, ప్లాస్టిక్, వేస్ట్ పేపర్స్, బట్టలు, బాటిల్స్, కొబ్బరి బొండాలు తదితర చెత్తను క్లీన్ చేయడానికి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాంటాక్ట్ లెస్ వ్యాక్యూమ్ ఆపరేటెడ్ మెషీన్‌ను అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు మెక్లాన్ కంపెనీకి చెందిన ‘జటాయు’ అనే మెషీన్ పనితీరును గురువారం ఐమాక్స్ వద్ద పరిశీలించారు.
ఏ కాలంలోనైనా ఇది పని చేస్తుందని, వెదర్ప్రూఫ్గా రూపొందించామని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. కార్మికులు చేతితో ఎత్తడానికి ఇబ్బంది పడే చెత్తను కూడా ఈ మెషీన్తనలోకి లాక్కుంటుంది. ఒకే చోట భారీగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుందని అధికారులంటున్నారు. ఈ మెషీన్ ద్వారా తీసిన చెత్తను డైరెక్ట్ గా ట్రక్‌లో వేసి డంపింగ్ యార్డుకు తరలించవచ్చు. వెహికల్ డ్రైవర్‌తో పాటు మెషీన్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది. అయితే, ఈ మెషీన్ పనితీరును మేయర్, కమిషనర్ దృష్టి తీసుకెళ్తామని, వారు ఓకే చెప్తే బల్దియా అమ్ముల పొదిలో చేరుతుందని అధికారులంటున్నారు. కాగా ఈ యంత్రం విలువ దాదాపు రూ.25లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.