త్వరలో ఇంటికో క్యూఆర్ కోడ్!

త్వరలో ఇంటికో క్యూఆర్ కోడ్!
  • సేవలను మరింత ఈజీ చేసే యోచనలో జీహెచ్ఎంసీ
  • హర్యానాలోని గురుగ్రామ్​లో అమలులో క్యూఆర్ ​కోడ్ ​సిస్టమ్
  • అక్కడి పనితీరును పరిశీలించి వచ్చిన నిపుణుల బృందం 

హైదరాబాద్, వెలుగు : త్వరలో గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో క్యూఆర్​కోడ్​ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్ సిటీ తరహాలో సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. ఐదుగురు నిపుణులతో కూడిన జీహెచ్ఎంసీ బృందం రెండు నెలల కింద గురుగ్రామ్ లో పర్యటించింది. అక్కడి క్యూఆర్​కోడ్ అమలు తీరును పరిశీలించింది. సిటీ ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకుంది.

నిపుణుల బృందంలో హెచ్ఎండీఏ నుంచి హుమ్టా ఎండీ బి.జీవన్ బాబు, డీటీసీపీ నుంచి జీఐఎస్​హబ్ ప్రాజెక్ట్  డైరక్టర్ డి.రమేశ్ బాబు, వాటర్ బోర్డు నుంచి జీఐఎస్ ఎక్స్ పర్ట్ యు.మల్లికార్జున్ రావు, ఎన్ఐయూఎం నుంచి అర్బన్ ప్లాన్ ఎక్స్ పర్ట్ రోహన్ రవికుమార్, జీహెచ్ఎంసీ నుంచి చీఫ్ ఇన్ఫర్ మేషన్ ఆఫీసర్ సుధీర్ నాథ్ ఉన్నారు. వీరి రిపోర్టుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో క్యూఆర్​కోడ్​సేవలు అమలు చేస్తే ఎంతమేరకు ఉపయోగపడుతుందన్న దానిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.

ఒకవేళ బల్దియా పరిధిలో అమలు చేస్తే.. ప్రాపర్టీ ట్యాక్స్ కోసం కొనసాగుతున్న జీఐఎస్ సర్వేను దీనికి ఉపయోగించనున్నారు. గురుగ్రామ్​లో  యూనిక్ డిజిటల్ ఐడీ పేరుతో ప్రతి ఇంటికి ఒక క్యూర్ కోడ్ ఉంది. దాని ఆధారంగా బిల్లుల చెల్లింపు జరుగుతోంది. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆ కోడ్ ఉపయోగపడుతోంది.

అదే విధానాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేస్తే బిల్లుల చెల్లంపులు సక్రమంగా జరిగేందుకు వీలుంటుంది. జీహెచ్ఎంసీ అందిస్తున్న సేవలు 100 శాతం ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. తొలుత ఒక సర్కిల్ ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని క్యూఆర్​కోడ్​సేవలను అమలు చేయాలని అధికారులు చూస్తున్నారు. తర్వాత అన్ని సర్కిళ్లలో అమలు చేయనున్నారు.