GHMCలో రెయిన్​ వాటర్​హోల్డింగ్ స్ట్రక్చర్స్..మస్త్​ పనిచేసినయ్​

GHMCలో రెయిన్​ వాటర్​హోల్డింగ్ స్ట్రక్చర్స్..మస్త్​ పనిచేసినయ్​
  •  నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాంతాల్లో తప్పిన ఇబ్బందులు 
  • గతంతో పోలిస్తే తొలగిన ట్రాఫిక్ సమస్య
  • ఇప్పటికే నాలుగు చోట్ల నిర్మాణాలు పూర్తి 
  • ఎనిమిది చోట్ల కొనసాగుతున్న నిర్మాణాలు 
  • ఇంకో 50 చోట్ల ఏర్పాటు చేసేందుకు బల్దియా ప్లాన్​ 
  • వర్షాకాలంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరంలో వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై వరద నీరు నిలవకుండా నిర్మించిన రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు ఉపయోగపడ్తున్నాయి. మొదటి ఫేజ్ కింద నగరంలోని 12 సమస్యాత్మక ప్రాంతాల్లో హోల్డింగ్​స్ట్రక్చర్ల నిర్మాణం మొదలుపెట్టగా, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వద్ద రెండు చోట్ల, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు ముందు ఒకటి, సచివాలయం సమీపంలో మరొక హోల్డింగ్​స్ట్రక్చర్​నిర్మాణం పూర్తయ్యింది. 

ఈ క్రమంలో గురువారం మూడు గంటల్లో 9 సెంటిమీటర్ల వర్షం కురవగా ఈ నాలుగు ప్రాంతాల్లో గతంలో ఉన్నంత తీవ్రత కనిపించలేదు. రాజ్ భవన్ రోడ్డులో గతంలో 5 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే వాహనాలు వెళ్లలేకపోయేవి. కానీ, గురువారం 9 సెంటిమీటర్లు దాటినా పెద్దగా ఇబ్బందులు కలగలేదు. ఈ హోల్డింగ్​స్ట్రక్చర్లను 10 లక్షల లీటర్ల నీటిని స్టోర్​చేసుకునేలా నిర్మించారు. 

దీంతో గురువారం భారీ వాన కురవగా 10 లక్షల లీటర్లను లోపలకు తీసుకున్నాయి. లేకపోతే ఆ నీరంతా రోడ్డుపైనే ఉండి ఇబ్బందులు తలెత్తేవి. అలాగే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద కూడా నడుం లోతు నీరు చేరేది. ఇక్కడ కూడా హోల్డింగ్​స్ట్రక్చర్​తో ఇబ్బందులు తప్పాయి. దీంతో గ్రేటర్ లో మరో 50 చోట్ల  హోల్డింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే మొదటి దశలో ఎల్బీనగర్​లో రెండు చోట్ల, శేరిలింగంపల్లిలో రెండు చోట్ల , రాజేంద్రనగర్ లో ఒక చోట, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద మరొక హోల్డింగ్​స్ట్రక్చర్​నిర్మిస్తున్నారు. మరో రెండు చోట్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 

వెంటనే నీళ్లు ఖాళీ

రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లలో సుమారు 10 లక్షల లీటర్ల నీరు స్టోరేజీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రక్చర్లలో నీరు నిండిన వెంటనే తొలగించేందుకు జీహెచ్ఎంసీ వాటి దగ్గర 25 హెచ్ పీ కెపాసిటీ ఉన్న మోటార్లను బిగించింది. గురువారం కురిసిన వర్షానికి నిండిన హోల్డింగ్​స్ట్రక్చర్లలో నీటిని కేవలం నాలుగు గంటల్లోనే తొలగించింది. 

మూడు గంటల్లోనే 9 సెంటీమీటర్లు కురిసి నిండడంతో వెంటనే ఖాళీ చేయడానికి ఈ చర్యలు చేపట్టింది. ఈ స్ర్టక్చర్లు నిర్మించిన తర్వాత ఇంత పెద్ద వర్షం పడడం ఇదే తొలిసారి. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో అరగంట లోనే హోల్డింగ్​స్ట్రక్చర్లు పూర్తిగా నిండాయి. చిన్నపాటి, మోస్తరు వర్షాలు కురిసినా ఏమాత్రం ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు.  

వర్షాకాలంలోపు సెకండ్ ఫేజ్

రానున్న వర్షాకాలంలోపు ఫస్ట్ ఫేజ్ లో మొదలుపెట్టిన12 రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లలో మిగిలిన ఎనిమిదింటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ పనులు చేస్తోంది. ఇవి పూర్తి చేయడంతో పాటు సెకండ్ ఫేజ్ పనులు చేసేందుకు ప్లాన్​చేస్తోంది. దీని కోసం వాటర్ లాగింగ్ సమస్య ఎక్కువున్న ప్రాంతాలను గుర్తిస్తోంది. మరిన్ని నిర్మాణాలు జరపాలని అనుకుంటోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి ఈ విషయమై శుక్రవారం అధికారులతో చర్చించారు.  

కేసీఆర్ ఉత్త ముచ్చట చెప్పిండు  మేం చేసి చూపించినం 

తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్​నేత నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తానని గప్పాలు కొట్టిండు. వర్షం పడితే రాజ్​భవన్​ముందు పడవలు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, వారు అధికారంలోకి వస్తే ఎక్కడా అటువంటి పరిస్థితి ఉండదని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు. కానీ, పదేండ్లు అధికారంలో ఉన్నా కనీసం రాజ్​భవన్​ముందు కూడా సమస్యను పరిష్కరించలే..మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పరిష్కారం చూపినం. 

రాజ్​భవన్ ​ముందే కాదు..మరో మూడు చోట్ల 10 లక్షల లీటర్ల వర్షం నీటిని ఒడిసి పట్టే రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను నిర్మించినం. వచ్చే వర్షాకాలంలోపు మరో ఎనిమిది చోట్ల హోల్డింగ్​స్ట్రక్చర్లను పూర్తి చేయబోతున్నం. ఇంకా 50 చోట్ల నిర్మించాలని ప్లాన్​చేస్తున్నం. ఇదంతా కాంగ్రెస్​ సీఎం రేవంత్ రెడ్డి విజన్​లో భాగమే..ఫ్యూచర్​సిటీ కూడా ఇందులో భాగమే..గ్రేటర్​ను గ్లోబల్​సిటీగా మార్చడానికి ఏం చేయాలో అంతా చేస్తం. మేం మాటలు చెప్పెటోళ్లం కాదు..చేతల్లో చూపేవాళ్లం.. మేం ప్రజాపాలన చేస్తం.. ప్రజల కోసమే పని చేస్తం.  

-పొన్నం ప్రభాకర్, హైదరాబాద్​ ఇన్​చార్జి మంత్రి