రెండున్నర కోట్లతో 5 లక్షల మట్టి గణనాథులు

రెండున్నర కోట్లతో 5 లక్షల మట్టి గణనాథులు
  • గ్రేటర్​ పరిధిలో పంపిణీకి అధికారులు ప్లాన్​  
  • ప్రతి డివిజన్​లో 3 వేల విగ్రహాలు ఇచ్చేలా కసరత్తు
  • 3 కేటగిరీల్లో మట్టి విగ్రహాల తయారీకి వారంలో టెండర్లు 

హైదరాబాద్, వెలుగు : వినాయక చవితి దగ్గర పడడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్​కంట్రోల్​బోర్డు అధికారులు మట్టి విగ్రహాల పంపిణీపై ఫోకస్​పెట్టారు. ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో 5 లక్షల మట్టి గణనాథులను పంపిణీ చేయాలని కసరత్తు చేస్తున్నారు. డివిజన్ లో 2,500 విగ్రహాలు పంపిణీ చేయాలని ప్లాన్​చేస్తున్నారు. విగ్రహాల తయారీకి సంబంధించిన ప్రక్రియను ఆయా శాఖల అధికారులు స్పీడప్​చేశారు. మొత్తం మూడు కేటగిరీల్లో విగ్రహాలు చేయించనున్నారు. 8 ఇంచులు, ఒక అడుగు, 1.5 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాలను తయారు చేయించి అందించనున్నారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 3 లక్షలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా లక్ష, హెచ్ఎండీఏ ద్వారా మరో లక్ష విగ్రహాలు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వారంలో విగ్రహాల తయారీకి సంబంధించిన టెండర్లు పూర్తికానున్నాయి. గతేడాది మారిదిగానే నలుగురికి టెండర్లను అప్పగించనున్నారు. ఏటా చాలా విగ్రహాలు డ్యామేజ్​అవుతున్నాయి. ఈసారి అలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టెండర్లు పొందినవారికి గట్టి ఆదేశాలు జారీ చేయనున్నారు. మొత్తం 5 లక్షల మట్టి విగ్రహాల తయారీకి ప్రభుత్వం ఆయా శాఖల నుంచి రూ.2.50 కోట్లు ఖర్చు చేయనుంది. 

గతేడాది పంపిణీ జరిగిందిలా..

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలనే నినాదంతో జీహెచ్ఎంసీ గతేడాది మొత్తం 3,16,000 విగ్రహాలు పంపిణీ చేసింది. ఇందులో 1.5 అడుగులు, అడుగు, 8 ఇంచుల విగ్రహాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ ద్వారా 8 ఇంచుల విగ్రహాలు 79,200, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 8 ఇంచుల విగ్రహాలు 75,000 పంపిణీ చేశారు. మొత్తంగా 4,64,200 మట్టి విగ్రహాలను గ్రేటర్ పరిధిలో పంపిణీ చేశారు.

పంపిణీ కోసం ప్రతి సర్కిల్ కు ఒక ఏఎంఓహెచ్ ను ఇన్ చార్జిగా, ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ ను ఇన్ చార్జీగా నియమించారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో నియమించనున్నట్లు ఓ సీనియర్​అధికారి తెలిపారు. గతేడాది మట్టి విగ్రహాల తయారీ కోసం జీహెచ్ఎంసీ రూ.కోటి54లక్షల24వేలు ఖర్చు చేసింది.