
- సిటీలో అప్లై చేసి దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు
- సర్టిఫికెట్ ఇష్యూ అయితే మరోచోట దరఖాస్తుకు నో చాన్స్
- కేంద్ర ప్రతినిధులతో బల్దియా కమిషనర్ మీటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇకపై కట్టుదిట్టంగా, అక్రమాలకు తావులేకుండా బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇక్కడి నుంచి సర్టిఫికెట్జారీ అయితే, దేశంలో ఎక్కడి నుంచైనా తీసుకునేలాగా.. మార్పులు, చేర్పులు చేస్తే తెలిసిపోయేలాగా సీఆర్ఎస్(సివిలియన్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా, ఇక్కడ ఇంప్లిమెంట్చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో బల్దియా కమిషనర్ ఇలంబరితి ఇప్పటికే చర్చలు జరిపారు.
మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే ఇక్కడ జారీ చేసే బర్త్ సర్టిఫికెట్ల వివరాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వర్లలో కనిపిస్తాయి. ఒకసారి జారీ చేసిన సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పులు చేస్తే తెలిసిపోతుంది. తప్పుడు సర్టిఫెకెట్లు జారీ అయితే జీహెచ్ఎంసీతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను హెచ్చరించడంతోపాటు అలెర్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ప్రయోజనం లేకపోవడంతో..
బల్దియాలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ విషయంలో గతంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. 36 వేల ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని గుర్తించిన ఉన్నతాధికారులు అప్పట్లో సాఫ్ట్ వేర్ లో మార్పులు, చేర్పులు చేశారు. అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టవచ్చని భావించారు. అయినా మళ్లీ ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. గతేడాది ఫలక్ నుమా సర్కిల్లో నాన్ అవైలబిలిటీ కింద 60 సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఈ దరఖాస్తులన్నీ ఒకే మీ సేవ నుంచి వచ్చినట్లు గుర్తించారు. స్పందించిన కమిషనర్ మీ సేవ ఓనర్, జీహెచ్ఎంసీ ఆఫీసర్సహా దరఖాస్తు చేసిన వారితో కలిపి మొత్తం 42 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. తర్వాత దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ కూడా జరిపారు. తర్వాత ప్రతి సర్టిఫికెట్ కి సంబంధిత సర్కిల్ స్థాయి మెడికల్ ఆఫీసర్ కు ఓటీపీ వచ్చే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. దీనివల్ల కూడా పెద్దగా మార్పులేదని భావించిన కమిషనర్సీఆర్ఎస్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.
నాన్ అవైలబిలిటీ పై ఫోకస్
పుట్టిన, మరణించిన ఏడాది తర్వాత సర్టిఫికెట్ల కోసం అప్లయ్ చేసుకునేవారు నాన్ అవైలెబిలిటీ(ఎన్ఏ) కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆర్డీఓ నుంచి ప్రొసీడింగ్స్ తీసుకొని దాని ఆధారంగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం జీహెచ్ఎంసీకి అప్లయ్ చేసుకోవాలి. కానీ, ఆర్డీఓ ప్రొసీడింగ్స్ లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు గతంలో గుర్తించారు. విజిలెన్స్ అధికారులు కూడా పలుమార్లు విచారణ జరిపి వాస్తమేనని రిపోర్టులు ఇచ్చారు.
కాగా, కొత్తగా తీసుకురాబోయే సీఆర్ఎస్ విధానంతో నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ల జారీపై కూడా ఫోకస్ పెడతారు. సర్టిఫికెట్ జారీ అయిన వెంటనే ఆ సర్టిఫికెట్ కి సంబంధించి వివరాలు సరిగ్గా పొందుపర్చారా? లేదా అన్నది చెక్ చేస్తారు. బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన తర్వాత పేర్లు మార్చినా, పుట్టిన తేదీలు, తండ్రి, తల్లుల పేర్లు మార్చినా తెలిసిపోతుంది. మొత్తానికి కొత్త విధానం వల్ల ఫేక్ సర్టిఫికెట్ల జారీకి చెక్పడుతుందని ఆశిస్తున్నారు.