అడ్డగోలు రోడ్ల కటింగ్​కు చెక్.. కొత్త రూల్స్ తెచ్చిన జీహెచ్ఎంసీ

అడ్డగోలు రోడ్ల కటింగ్​కు చెక్.. కొత్త రూల్స్ తెచ్చిన జీహెచ్ఎంసీ
  • కేబుల్స్, వాటర్, డ్రైనేజీ కోసం ఇష్టారీతిన తవ్వకాలు  
  •  సర్కిల్​పరిధిలో పర్మిషన్లతో సమస్యలు 
  • ఇకపై ఉన్నతాధికారుల అనుమతి, ఫీల్డ్​ విజిట్​ తప్పనిసరి..

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో అడ్డగోలు రోడ్ల కటింగ్​లకు జీహెచ్ఎంసీ చెక్ పెట్టింది. కేబుల్స్​కోసం, వాటర్, డ్రైనేజీ పనుల కోసం రోడ్లు తవ్వడానికి జీహెచ్ఎంసీ సర్కిల్ లెవెల్​లో కొందరు అధికారులు అక్రమంగా అనుమతులిస్తుండడంతో నాశనమవుతున్నాయి. రోడ్డు తవ్వి పని పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. చాలాచోట్ల రాత్రికిరాత్రే పనులు చేసి గుంతల్లో మట్టిపోసి వదిలేస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక చోట ఇలా జరుగుతూనే ఉంది. 

ఇంకొన్ని చోట్ల కాంట్రాక్టర్లు రోడ్డు వేయకపోయినా అధికారులు పట్టించుకోవడంలేదు. దీని గురించి సర్కిల్ అధికారులను అడిగితే ‘వాళ్లు రోడ్డెయ్యకపోతే మేమేం చేస్తం’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. తవ్విన వారే రోడ్డు వేయాలన్న నిబంధన ఉన్నా, రోడ్డు వేయించాల్సిన బాధ్యత సర్కిల్ అధికారులపై ఉన్నా లైట్​తీస్కుంటున్నారు. వీటికి సంబంధించిన ఫైళ్లను పూర్తి వివరాలతో హెడ్డాఫీసుకు పంపించాల్సి ఉండగా, అసంపూర్తిగా పంపుతున్నారు. దీంతో బల్దియా కమిషనర్​కొత్త రూల్స్​తీసుకువస్తూ సర్క్యులర్​జారీ చేశారు.  

 నిబంధలు ఇవే...

ఎక్కడైనా 10 మీటర్ల వరకు రోడ్డు కటింగ్ చేయాల్సి వస్తే సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) అనుమతులివ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల రోడ్డు కట్​చేయాలని అప్లికేషన్​వస్తే సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్​ఈ) పరిశీలించి, అనుమతులివ్వాలి. అయితే, దీని కోసం తప్పనిసరిగా..ఫీల్డ్ విజిట్ చేయాలి. 15 మీటర్ల కన్నా ఎక్కువ రోడ్డు కట్​చేయాలని అనుమతి కోరుతూ దరఖాస్తు వస్తే ఫీల్డ్ లెవెల్​లో తనిఖీలు నిర్వహించి, వేదికతో పాటు ఆ ఫైల్ ను ఆఫీసు ద్వారా మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్​(సీఈ)కు పంపాల్సి ఉంటుంది. 

ఇదివరకు ఇదంతా సర్కిల్, జోనల్ లెవెల్​లోనే పూర్తి చేసేవారు. దీంతో తవ్విన రోడ్లను తిరిగి వేయకున్నా పట్టించుకునేవారు కాదు. ఇక నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి  రోడ్డు కట్​వేయకపోవడం అనే సమస్య ఉండదు.  

ఛార్జీలు వసూల్ చేయాలె...

రోడ్లు తవ్విన వారి నుంచి తిరిగి నిర్మించేందుకు ఛార్జీలు కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా బల్దియా అధికారులపైనే ఉంటుంది. ఆ ఛార్జీలను కూడా పక్కాగా రాబట్టాలని సర్క్యులర్​లో చీఫ్ ఇంజినీర్ పేర్కొన్నారు. జీవో 82 ప్రకారం రోడ్డు కటింగ్​క్యాలికులేషన్లు, జీవో 53 ప్రకారం విధించాల్సిన రోడ్డు కటింగ్​ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించారు.