- 2వేల టాయిలెట్ల దాకా కనిపిస్తలే..ఇంటెలిజెన్స్ విచారణలో వెల్లడి
- గతంలో గ్రేటర్‌లో 7,400 టాయిలెట్లు ఏర్పాటు
- అందులో సగానికిపైగా వినియోగంలో లేవని గుర్తింపు
- త్వరలో సర్కారుకు రిపోర్టు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ టాయిలెట్లు మాయమయ్యాయి. ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన వాటిలో చాలా వరకు కనిపించడంలేదు. 7,400 టాయిలెట్లు నిర్మించగా సగానికి పైగా వినియోగంలో లేవని, కొన్నిచోట్ల గాయబ్ అయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. దాదాపు రెండు వేల వరకు టాయిలెట్లు కనిపించడంలేదు. కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసినవి వినియోగానికి రాకుండా పోవడంపై సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ జరుపుతోంది. టాయిలెట్ల నిర్వహణ నుంచి ఏజెన్సీలకు ఇస్తున్న బిల్లుల దాకా అన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఏదైనా అవినీతి జరిగిందా అనే కోణంలోనే విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.
ఒక్కో టాయిలెట్‌కి నెలకి రూ.4 వేలు
గ్రేటర్ ఎన్నికలకు ముందు 7,400 టాయిలెట్లను నిర్మించగా, ఇందులో 5,088 టాయిలెట్లను మెయింటెనెన్స్ కోసం ఒక్కో టాయిలెట్‌కి నెలకి ఏరియాలని బట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తూ ఏజెన్సీలకు అప్పగించారు. ఈ టాయిలెట్ల నిర్వహణకు జీహెచ్ఎంసీ నెలకి రూ.2 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. మిగతావి యాడ్స్ పర్పస్‌లో ఏర్పాటు చేశారు. అవి కూడా క్లీన్ చేయకపోవడం, అన్ని చోట్లా డ్యామేజ్ జరగడంతో తొలగించారు. దీంతో చాలా చోట్ల టాయిలెట్లు అందుబాటులో ఉండటంలేదు. వివిధ పనుల కోసం వచ్చే వారికి ‘అర్జెంట్’ అయితే ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. తిరిగి పే అండ్ యూజ్ టాయిలెట్లకు వెళ్లక తప్పడం లేదు. టాయిలెట్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని జీహెచ్ఎంసీ వృథా చేస్తున్నదని జనం మండిపడుతున్నారు. చివరికి ‘పే అండ్ యూజ్’ టాయిలెట్లు, బస్‌స్టాప్‌ల వద్ద ఉండే సులభ్ కాంప్లెక్స్‌లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
నీళ్లు ఉంటలే.. క్లీన్ చేస్తలే
బస్‌స్టాపులు, ఫుట్‌పాత్‌లు, పార్కుల వద్ద ఏర్పాటు చేసిన టాయిలెట్లలో చాలా వరకు ప్రస్తుతం కనిపించడంలేదు. ఈ విషయంపై అధికారులను అడిగితే లొకేషన్లు చేంజ్ చేసినట్లు చెబుతున్నా.. వేరే ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయలేదు. ఇదే అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. లొకేషన్ మార్చిన టాయిలెట్లు ఉన్నాయా, లేదా అనే దానిపై విచారిస్తున్నారు. ఏజెన్సీలకు అప్పగించిన టాయిలెట్ల మెయింటెనెన్స్‌పైనా వివరాలు సేకరిస్తున్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో అయితే రోజుకు నాలుగు సార్లు, నాన్ కమర్షియల్ ప్రాంతాల్లో అయితే రోజుకు కనీసం మూడు సార్లు టాయిలెట్లను క్లీన్ చేయాల్సి ఉంది. డైలీ క్లీనింగ్ చేస్తున్నారా? లేదా అన్న దానిపై స్థానికుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. విచారణ తర్వాత సీఎం కేసీఆర్‌కి నివేదికను అందించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతమున్న టాయిలెట్లలోనూ సగానికిపైగా సరిగ్గా లేనట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. కొన్నిచోట్ల డైలీ ఒక్కసారి కూడా క్లీన్ చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. పైపులు పగిలిపోయి కనిపిస్తున్నాయని, కొన్ని టాయిలెట్లకు కనీసం డోర్లు కూడా ఉండటం లేదని అంటున్నారు. 50 శాతానికిపైగా టాయిలెట్లలో వాటర్ కూడా అందుబాటులో ఉండటం లేదని ఆఫీసర్లు గుర్తించడం లేదు.