గ్రేటర్​హైదరాబాద్‌లో 49 టీమ్స్‌తో కుక్కలను పడుతున్నం

గ్రేటర్​హైదరాబాద్‌లో 49 టీమ్స్‌తో  కుక్కలను పడుతున్నం
  •     రోజూ 250  బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నం
  •     ఆపరేషన్ థియేటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినం 
  •     కుక్కలకు ఫుడ్​ పెట్టాలంటే రిజిస్టర్​ చేసుకోవాలని జనానికి చెప్పినం  
  •     హైకోర్టుకు వివరించిన జీహెచ్​ఎంసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు :  స్ట్రీట్​డాగ్స్​ నియంత్రణ విషయంలో తాము సీరియస్​గా పని చేస్తున్నామని జీహెచ్ఎంసీ హైకోర్టుకు తెలిపింది. వీధి కుక్కల దాడుల నుంచి జనాలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బల్దియాను కోరిన నేపథ్యంలో కౌంటర్​ఫైల్​చేసింది. హైకోర్టులో జరిగిన విచారణకు జీహెచ్ఎంసీ నుంచి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్(సీవీవో) అబ్దుల్ హాజరు కాగా వేణుమాధవ్ తన వాదనలు వినిపించారు. 

80% బర్త్​ కంట్రోల్​ సర్జరీలు చేశాం 

గ్రేటర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్  సర్జరీ( స్టెరిలైజేషన్) లపై దృష్టి పెట్టామని, ఇప్పటి వరకు 80 శాతం సర్జరీలు చేసినట్లు తెలిపారు. రోజూ 430 వరకు సర్జరీలు చేసే వీలుండగా ప్రస్తుతం 250 వరకు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  కుక్కలను తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకుండానే వదిలేస్తున్నారని కొంతమందికి అనుమానాలున్నాయని, వాటికి చెక్​పెట్టేందుకు ఆపరేషన్ థియేటర్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు యానిమల్ కేర్ సెంటర్లు ఉన్నాయని, ఇందులో 2,164 డాగ్స్ ను ఉంచేందుకు కెపాసిటీ ఉందన్నారు. మరో రెండు సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 

24 గంటలూ పని చేస్తున్న క్యాచింగ్​ టీమ్స్​

తమ దగ్గర 49 డాగ్ క్యాచింగ్ టీమ్స్ ఉన్నాయని, వీరు 24 గంటల పాటు పని చేస్తున్నారని బల్దియా కోర్టుకు తెలిపింది. డాగ్స్ కి ఫీడింగ్​చేసేందుకు ఆసక్తి ఉన్నవారు రిజిస్ర్టేషన్ చేసుకునే విధంగా ఓ వెబ్ సైట్ పెట్టామన్నారు. రిజిష్టర్​అయ్యాక ఎక్కడపడితే అక్కడ ఫుడ్​పెట్టకుండా వారికి స్కూల్స్, ప్లే గ్రౌండ్ తదితర జనవాసాలకు దూరంగా ఉండే లోకేషన్స్  కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఫుడ్​పెడతామంటూ 98 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 

నీటి తొట్టెలు పెట్టాం 

కుక్కల దాహం తీర్చడానికి 7,127 నీటి తొట్టీలను ఏర్పాటు చేసినట్టు కోర్టులో ఫైల్​చేసిన కౌంటర్​లో పేర్కొన్నారు. దాహంతో ఉన్న కుక్కలు కూడా మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుందని, తాము నీటి తొట్టీలు ఏర్పాటు చేయడం వల్ల దాడులను నివారించగలుగుతున్నామన్నారు. కుక్కకాటు నుంచి ఎలా తప్పించకుకోవాలనే దానిపై 1808 స్కూల్స్ లో 3,98,000 స్టూడెంట్స్​కు , 3, 091 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఆయా కాలనీల్లో, 153 సెల్ప్​హెల్ప్ గ్రూప్ లు,  57 స్లమ్స్ లో జనాలకు అవగాహన కల్పించామన్నారు. 

నాన్​వెజ్​ షాపులకు నోటీసులు 

నాన్ వెజ్ షాపులు ఎక్కడ పడితే అక్కడ చికెన్, మటన్, బీఫ్ కి సంబంధించి వ్యర్థాలు పారవేస్తుండటంతో కుక్కలు ఒకేచోట గుమిగూడి మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని గుర్తించామని,  ఇలా మాంసం పారవేస్తున్న 5, 377 నాన్ వెజ్ షాపులకు  నోటీసులు ఇచ్చామన్నారు. కుక్కపిల్లలను, కుక్కలను దత్తత ఇస్తున్నామని, ఇప్పటివరకు  3, 093 కుక్కలను అడాప్షన్​ఇచ్చామన్నారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన ఆధారాలను ఫోటోలతో సహా అందజేశారు.  

కనిపించని ఫలితాలు

గ్రేటర్ లో కుక్కల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా చెబుతున్నా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. స్టెరిలైజేషన్ పక్కాగా చేస్తున్నామని చెస్తున్నా ఫీల్డ్​లెవెల్​లో కనిపించడంలేదు. కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్న కాలనీలపైనే దృష్టిపెట్టారని, దీంతో ఫిర్యాదులు రానీ ప్రాంతాల్లో స్టెరిలైజేషన్​పెద్దగా జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఢిల్లీ, జైపూర్, బెంగళూర్, చైన్నై, ముంబై, కోల్​కతా తదితర నగరాల్లో స్టెరిలైజేషన్ బాధ్యతలను ఎన్​జీవోలకు అప్పగించడంతోనే రిజల్ట్ బాగా వస్తోందని ఎక్స్​పర్ట్స్​చెబుతున్నారు. మన దగ్గర కూడా ఎన్జీవోలకు అప్పగిస్తే బాగుంటుందంటున్నారు. నగరంలో ఒక్క ఎల్బీనగర్ జోన్ లో మాత్రమే ఎన్టీవోల ఆధ్వర్యంలో స్టెరిలైజేషన్​ప్రక్రియ జరుగుతోంది. మిగతా 5 జోన్లలో జీహెచ్ఎంసీనే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 80 శాతం సర్జరీలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నా ఆ శాతం ఇంకా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.  

ఏటా రూ.11.5 కోట్ల ఖర్చు.. అయినప్పటికీ..

గ్రేటర్ లో ప్రస్తుతం దాదాపు 5 లక్షల కుక్కలున్నట్లు ఓ అంచనా. కుక్కలను పట్టుకోడానికి బల్దియా వద్ద  30 వాహనాలున్నాయి. వీటితో పాటు మరో 19 వాహనాలకు అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్, సర్జరీల కోసం, టీకాలు వేయించేందుకు కుక్కలను ఈ వాహనాల్లో యానిమల్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. అక్కడ కుక్క హెల్త్ కండీషన్ బట్టి తిరిగి వదిలిపెడుతున్నారు. ఇలా పదేండ్లలో 7,21,291 కుక్కలను స్టెరిలైజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఏటా రూ.11.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్తోంది. అయినా కుక్కల సంఖ్య తగ్గడం లేదు సరికదా దాడులూ పెరుగుతున్నాయి.