ఆక్రమణల్లో  GHMC టాప్

ఆక్రమణల్లో  GHMC టాప్

సాక్షాత్తూ జీహెచ్‌‌ఎంసీ కమిషనరే ఇంతలా అసహనం వ్యక్తం చేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆక్రమణలను తొలగించాల్సిన బల్దియానే టాయిలెట్స్‌‌, లూ కెఫే, రూ.5 భోజన కేంద్రాలు, బస్టాప్‌‌లు, చెత్త బుట్టలంటూ ఎక్కడికక్కడ ఫుట్‌‌పా త్‌‌లను ఆక్రమించడంతో పాదచారులు అవస్థలు పడుతున్నారు. సిటీ యాక్సిడెంట్ల మృతుల్లో 20 శాతం మంది వీరే ఉంటున్నారు. చిరువ్యాపారులపై విరుచుకుపడే అధికారులు వీటికేం సమాధానం చెప్తారని పబ్లిక్​ ప్రశ్నిస్తోంది

చిరు వ్యాపారుల బండ్లను ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై తొలగించేందుకు డోజర్లు, క్రేన్లతో ఆయా సర్కిళ్ల పరిధిలో జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు పెద్ద దండయాత్రనే కొనసాగిస్తున్నారు. ఉద్దేశం మంచిదే అయినపుడు అందరి విషయంలో ఒకేలా వ్యవహరించాలన్నది నగర ప్రజల అభిప్రాయం. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో మొత్తం తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా.. వాటి పక్కన పాదచారులు నడిచేందుకు ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు కంటిన్యూగా రెండు కిలోమీటర్లు కూడా లేవు. ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై ఛాట్‌‌‌‌ బండార్‌‌‌‌లు, మిర్చి బండ్లు, టిఫిన్లు సెంటర్లతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వారి చిరు దుకాణాల తొలగించే కార్యక్రమం నగరంలో కొనసాగుతోంది. దుకాణదారులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పాదచారులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో బల్దియా చర్యలను స్వాగతిస్తున్నా.. ఈ నిబంధనల ప్రకారం తాము ఎందుకు నడుచుకోవడం లేదో అధికారులకే తెలియాలి. ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ ఆక్రమణలపై భారీ జరిమానాలను విధించే జీహెచ్‌‌‌‌ఎంసీకి ఎవరూ జరిమానా వేయాలో మరి.  నగరంలోని అనేక చోట్ల జీహెచ్‌‌‌‌ఎంసీ ఆధ్వర్యంలోని టాయిలెట్లు, వాటర్‌‌‌‌ ఏటీఎంలు, రూ.5 భోజనం సెంటర్లు.. డస్ట్‌‌‌‌బిన్‌‌‌‌లు.. ఇలా ఒకటేమిటి చివరకూ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, బస్టాండ్‌‌‌‌లు కూడా ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల మధ్యలో నిర్మించడంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రమాద మృతుల్లో 20 శాతం పాదచారులే..

నగరంలోని ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల ఆక్రమణలు తొలగించాల్సిన బల్దియానే తమ చర్యలు, నిర్మాణాల ద్వారా సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఏడాదిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 20శాతం వరకూ పాదచారులే ఉంటారని నివేదికలు చెప్తున్నాయి. గ్రేటర్‌‌‌‌లో ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కీలకమైన జీహెచ్‌‌‌‌ఎంసీ చర్యలు చేపట్టడంతో పాటు తమ పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలో సుమారు  313 ఉచిత టాయిలెట్లు,  141 అన్నపూర్ణ సెంటర్లు (రూ.5ల భోజనం),  వంద వాటర్‌‌‌‌ ఏటీఎంలతో పాటు 2,500 బస్‌‌‌‌ స్టాప్‌‌‌‌ల నిర్వాహణను జీహెచ్‌‌‌‌ఎంసీ నిర్వహిస్తోంది. ఇవన్నీ ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపైనే కొనసాగుతుండడం మరో విశేషం.. ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల ఆక్రమణలను తొలగించాల్సిన జీహెచ్‌‌‌‌ఎంసీనే ఈ విధంగా ప్రజలకు ఇబ్బందులకు గురిచేయడంపై విమర్శలు వస్తున్నాయి. నడక మార్గాల్లో అడ్డుగా ఉన్న ఈ నిర్మాణాలు తప్పించుకునేందుకు ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు దిగి రోడ్లపై నడవాల్సిన పరిస్థితి. వీటితో పాటు కేబుళ్లు, డ్రైనేజీల కోసం పైపులను కూడా ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపైనే వేస్తున్నారు.

పర్యాటక ప్రాంతాల్లో ఫుట్ పాత్​లు కనిపించడం లేదు

నగర ప్రధాన రహదారుల్లో బస్‌‌‌‌స్టాండ్‌‌‌‌లు, జీహెచ్ఎంసీ ఇతర నిర్మాణాలతో ప్రజలు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. జనాలు తిరిగే పర్యాటక కేంద్రాల్లో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లు కనిపించడం లేదు. సెక్రటేరియట్‌‌‌‌ ముందు ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌పై ట్రాన్స్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ ఉండటంతో పాదచారులు రోడ్డుపైనే నడుస్తున్నారు. ఎన్టీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌, లుంబినీ వనం ఎదుట గల ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై వాటర్‌‌‌‌ ఏటీఎంలు, టాయిలెట్లు, బస్టాండ్‌‌‌‌లు మధ్యలోనే నిర్మించారు. జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు సామాన్యులకు భారీ జరిమానాలు విధించడం కొంచెం పక్కన పెట్టి తమ సొంత ఆస్తులను ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై తొలగించి ఆదర్శవంతంగా వ్యవహరిస్తే ప్రజలు మన్ననలు పొందవచ్చు.. భవిష్యత్‌‌‌‌లో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ ఆక్రమణలను తొలగించేందుకు ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంటుంది.