జీహెచ్ఎంసీలో చేయని పనులకు బిల్లులు?..2023కు ముందు రూ.800 కోట్ల విలువైన పనులపై అనుమానాలు

  •  విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన కమిషనర్ ఇలంబర్తి
  •  ఆరేండ్లు ఉండాల్సిన రోడ్లు ఆరు నెలల్లోనే నాశనం 
  • బిల్లులు చేసిన ఆఫీసర్లలో వణుకు
  •  ఆందోళనతో జీహెచ్ఎంసీ ఆఫీసుకు వచ్చిన కాంట్రాక్టర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పూర్తికాని పనులకు బిల్లులు రెడీ చేసిన ఆఫీసర్లు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేందుకు రంగం సిద్దం చేయగా, కమిషనర్​ఇలంబర్తి బ్రేకులేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు కాంట్రాక్టర్లు సివిల్ వర్క్స్  పూర్తి చేయకున్నా, వేసిన రోడ్లు, డ్రైనేజీలు ఆరునెలలకే కొట్టుకపోయినా అధికారులు మాత్రం బిల్లులు ఫైనల్ చేశారని.. అందులో కొన్ని బిల్లులను ఇప్పటికే చెల్లించారని గుర్తించిన కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు.

2023కు ముందు చేపట్టిన పనులు, అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులపై తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అసలు ఆ పనులు జరిగాయా? లేదా? ఒకవేళ జరిగితే వాటి క్వాలిటీ, ప్రస్తుత పరిస్థితిపై నివేదిక తెప్పించుకుంటున్నారు. విషయం తెలిసి -ఆఫీసర్ల వెన్నులో వణుకు మొదలుకాగా, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు వద్ద కాంట్రాక్టర్లు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు చేసిన తప్పులకు అందరినీ ఎలా బలిచేస్తారని ప్రశ్నించారు. దీంతో ఈ అంశం ఇప్పుడు బల్దియా​వర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది. 

ఏటా కాగ్ నిలదీత.. స్పందించిన కమిషనర్  

జీహెచ్ఎంసీ పరిధిలో 2 వేలకుపైగా కాంట్రాక్టర్లు వివిధ పనులు చేస్తున్నారు. వీటికి సంబంధించి గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ.1,200 కోట్ల మేర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో 2023 డిసెంబర్ వరకు రూ.- 800 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూడడం పరిపాటిగా మారింది.

నిజంగా పనులు చేస్తే ఎందుకు ఇంతకాలం వెయిట్ చేస్తున్నారో అంతుపట్టని కమిషనర్ ఇలంబర్తి కొన్ని పనులను క్రాస్ ​చెక్​చేయగా, అంసపూర్తిగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆయా పనులు జరిగాయా? లేదా? ఒకవేళ జరిగితే పూర్తయ్యాయా? అసంపూర్తిగా ఉన్నాయా? క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు విజిలెన్స్ ఎంక్వైరీకి  ఆదేశించారు. శనివారం ఉదయం కూడా జోనల్ కమిషనర్లతో జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో ఇదే అంశంపై కమిషనర్ అనుమానాలు వ్యక్తంచేశారు.

మొత్తానికి విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో 2023కు ముందు జరిగిన పనుల్లో 635 ఫైళ్లకి సంబంధించిన డొంక కదలనుంది. ప్రధానంగా 2021, 2022, 2023 నాటి పనులపైనే కమిషనర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఏటా ఆయా పనులపై  జీహెచ్ఎంసీని కాగ్ కూడా నిలదీస్తూనే వచ్చింది. నాలాల పూడికతీత, రోడ్ల పనులు, డబుల్ ఇండ్ల నిర్మాణాలు తదితర పనులకు అక్రమంగా బిల్లులు జారీ చేశారని కాగ్ పలుమార్లు మొట్టికాయలు వేసింది. 

రోడ్ల కోసమే రూ.4,500 కోట్లు ఖర్చు.. 

గ్రేటర్ లో మొత్తం 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో 68.42 శాతం (6,167 కిలోమీటర్లు) సీసీ రోడ్లు ఉండగా, 31.58 శాతం (2,846  కిలోమీటర్లు) బీటీ రోడ్లు ఉన్నాయి.  ఇందులో 812 కిలోమీటర్ల ప్రధాన రహదారుల మెయింటెనెన్స్ ను ఏజేన్సీలకు అప్పగించగా.. మిగతా రోడ్లను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. రోడ్ల నిర్వహణ కోసం ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. 2004–14 మధ్య రోడ్ల కోసం రూ.2,700 కోట్లు ఖర్చుకాగా, 2014 నుంచి 2024 పదేళ్లలో రూ.4,500 కోట్లు ఖర్చయ్యింది. ఇందులో నిర్వహణ కోసం అప్పగించిన ఏజేన్సీలకే సగం వరకు నిధులు వెళ్తున్నాయి.

కానీ ప్రస్తుతం సిటీలో రోడ్లు చాలా ప్రాంతాల్లో డ్యామేజ్ అయి ఉన్నాయి. కాంట్రాక్టర్లు చేస్తున్న పనులు, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే రోడ్లు ఇటు వేస్తుంటే అటు డ్యామేజీ అవుతున్నాయి. ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులే కారణమనే చర్చ జరుగుతోంది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేళ్లు, సీసీ రోడ్డు అయితే10 ఏళ్లు డ్యామేజ్ కాకుండా ఉండాలి. కానీ, ప్రస్తుతం సిటీలో వేసిన రోడ్లు ఆరు నెలలు కూడా సరిగ్గా ఉండటంలేదు. క్వాలిటీ పాటించడం లేదన్న ఆరోపణలు రావడంతో కాంట్రాక్టర్లు వేసిన రోడ్లను ఇకపై నాలుగు సార్లు టెస్టులు చేయాలని రెండు నెలల క్రితం బల్దియా నిర్ణయించింది.  

కాంట్రాక్టర్లలో ఆందోళన.. 

కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు చేసిన తప్పులకు తాము బలి అవుతున్నామని శనివారం జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద పలువురు కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కమిషనర్​ని కొందరు ఇప్పటికే కలవగా, ఇంకొందరు కలిసేందుకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసుకి వచ్చారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆఫీసులో వినతిపత్రం ఇచ్చి వెళ్లారు. ఎవరో చేసిన తప్పులకు తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చేసిన పనులకు సంబంధించిన బిల్లుల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నామని, తీరా ఇప్పుడు విచారణ పేరుతో బిల్లులను పెండింగ్ పెట్టడమేంటని ప్రశ్నించారు. అప్పులు తీసుకొచ్చి తాము పనులు చేశామని, బిల్లులు రాకుంటే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదన్నారు. అప్పుల బెంగతో ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు గుండెపోటుతో మరణించారని తెలిపారు. ఒకవేళ కమిషనర్ ఎంక్వైరీ చేయాలనుకుంటే వారం రోజుల్లో వేగంగా విచారణ జరిపి బిల్లులు రిలీజ్ చేయాలని కోరారు.

ఆఫీసర్లలో వణుకు..

జీహెచ్ఎంసీ కమిషనర్ తీసుకున్న నిర్ణయం కాంట్రాక్టర్లతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల్లో వణుకు పుట్టి స్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అప్పట్లోఎంఏయూడీ మంత్రిగా ఉన్న కేటీఆర్​కు తెలియకుండా ఏ బిల్లు కూడా శాంక్షన్​కాని పరిస్థితి ఉండేది. అధికారులు కూడా తమకెందుకు వచ్చిన తలనొప్పి అని అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే పనులు చేశారు.

కాంట్రాక్టర్లు పనులు చేశారా? లేదా? అసంపూర్తిగా వదిలేశారా? క్వాలిటీతో చేశారా? అన్నవి పట్టించుకోకుండా గుడ్డిగా బిల్లులు చెల్లించేవారనే ఆరోపణలున్నాయి. తీరా ఇప్పుడు విజిలెన్స్ విచారణ అనడంతో ఆఫీసర్లలో భయం మొదలైంది. అడ్డదారిలో ఇప్పటికే బిల్లులు చెల్లిస్తే రికవరీ చేసే ఆలోచనలో కూడా కమిషనర్ ఉన్నట్లు తెలిసి  ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.