బూస్టర్​ డోస్​ కోసం ఫోన్​ చేస్తే స్పందించని బల్దియా

బూస్టర్​ డోస్​ కోసం ఫోన్​ చేస్తే స్పందించని బల్దియా

“ఆసిఫ్​నగర్​కు చెందిన దుర్గమ్మ (80) కు వ్యాక్సిన్​ వేయించేందుకు మనవడు బల్దియా హెల్ప్​లైన్​కు బుధవారం ఉదయం ఫోన్ చేసిండు. వ్యాక్సినేషన్​ డిపార్ట్​మెంట్​నంబర్​ కలవడం లేదని, సాయంత్రం చేయమని చెప్పారు. సాయంత్రం 5:15  గంటలకు  ఫోన్ చేస్తే కాల్ బిజీ వస్తుందని, మళ్లీ కాల్​ చేయమని సమాధానం ఇచ్చారు. ఇలా ఎన్నిసార్లు చేసినా స్పందించడం లేదు.’’

“మాదాపూర్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మయ్య బల్దియా ప్రకటన చూసి బూస్టర్ డోస్​ వేయించుకునేందుకు హెల్ప్​ లైన్ నంబర్​కు మంగళవారం కాల్​ చేసిండు. ఈరోజే డ్రైవ్​ స్టార్ట్​అయిందని, వ్యాక్సినేషన్​ డిపార్ట్​మెంట్ వాళ్ల నంబర్​బిజీ వస్తుందని, తర్వాత చేయమని సమాధానం ఇచ్చారు. మరుసటి రోజు చేసినా కూడా అదే సమాధానం వచ్చింది. బయటకు వెళ్లే ఓపీక లేకున్నా కూడా వేరే చోటకు పోయి బూస్టర్ డోస్​ వ్యాక్సిన్​ తీసుకుండు.’’


హైదరాబాద్, వెలుగు: బల్దియా  ఏ పని సరిగా చేయట్లేదు.  చేస్తున్నట్లు ప్రకటించడం, ఆతర్వాత చేతులెత్తేయడం  అధికారులకు కామన్ అయింది. ఏదైనా పని చేసేముందు టార్గెట్​ పెట్టుకోకుండానే తూతూమంత్రంగా చేసేసి మధ్యలోనే బ్రేక్​పెట్టేస్తున్నారు. ఇష్టనుసారంగా తీసుకుంటున్న నిర్ణయాలతో జనానికి ఇబ్బందులు వస్తున్నాయి.   గ్రేటర్ లో 60 ఏండ్లు నిండిన వారికి బూస్టర్ డోసుని ఇంటికొచ్చి అందిస్తామని ప్రకటించింది. హెల్ప్ లైన్ నంబర్​కు  ఎప్పుడు ఫోన్ చేసినా మళ్లీ చేయమనే రిప్లై వస్తుంది. ఎన్నిసార్లు చేసిన కూడా అదే సీన్​ రిపీట్​అవుతుండగా జనాల్లో అసహనం వ్యక్తమవుతుంది. సిటీలో బూస్టర్​డోసు వ్యాక్సిన్​ కి సంబంధించి ఐదారు నెంబర్ మాత్రమే ఉండగా, వారికి  ఇన్ఫామ్​ చేసేందుకు ప్రయత్నిస్తే ఫోన్​ కలవడంలేదని బల్దియా టెలికాలర్ చెబుతున్నారు. ఈ నెల 1 నుంచిహెల్ప్​ లైన్ నంబర్​ 040–21111111 కి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి బూస్టర్ డోస్​ అందిస్తామని బల్దియా ప్రకటించింది.  రెండు రోజులుగా బూస్టర్​డోసు కావాలంటూ ఫోన్​ చేస్తున్న వారికి సరైన సమాధానం ఇవ్వడంలేదు.  దీంతో 60 ఏండ్లు ఉండి బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారు బూస్టర్ డోస్​ కోసం వెయిట్​చేస్తున్నారు. బల్దియా నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదు. దీనిపై ఉన్నతాధికారులను అడిగితే ఇబ్బంది ఉండకుండా చూస్తామని చెబుతున్నారు. 

ఫోన్ బిజీ వస్తుందంటూ.. 

బల్దియా హెల్ప్​ లైన్ నంబర్​కు ఉదయం ఫోన్​చేస్తే సాయంత్రం చేయమని చెబుతున్నారు. మళ్లీ సాయంత్రం కాల్ చేస్తే వ్యాక్సినేషన్ డిపార్ట్​మెంట్​ నంబర్ ​బిజీగా వస్తుందని, గంట తర్వాత చేయమని అంటున్నారు.  ఇలా ఎప్పుడు చేసినా కూడా ఏదో ఒకసాకు చెబుతూ కాల్​ కట్​చేస్తున్నారే తప్ప వ్యాక్సిన్​ పై వివరాలు చెప్పడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా సిబ్బంది ఇంటికొచ్చి ఇయ్యమని చెప్పినా తాము హెల్ప్ లైన్ నంబర్​కు కాల్ చేసి ఉండేది కాదని వృద్ధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సిటీలోని ఓల్డేజ్ హోమ్​ల్లోని పెద్దవారికి  కూడా బూస్టర్ డోస్​ వ్యాక్సిన్​ అందించడంలేదు.  

కో ఆర్డినేషన్  లేకనే..

బల్దియా, వైద్యారోగ్యశాఖ అధికారుల మధ్య  కో ఆర్డినేషన్​లేకపోవడంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బల్దియా హెల్ప్ లైన్​ నంబర్​కు  బదులుగా నేరుగా వ్యాక్సిన్ అందించేవారి కాంటాక్ట్​నంబర్లు  ఏర్పాటు చేస్తే  వ్యాక్సిన్​అందే అవకాశముంది. దీనిని బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదు. వైద్యారోగ్యశాఖ అధికారులకు అడిగితే తమ దృష్టికి బల్దియా వారు తీసుకొస్తే బూస్టర్ డోస్​ వేసేందుకు రెడీగా ఉన్నామని సమాధానం ఇస్తున్నారు