పైపు లీకేజీని ఇట్టే పట్టేస్తది!.. వాటర్​ పొల్యూషన్​ను నియంత్రించే లీకేజీ డిటెక్టర్

 పైపు లీకేజీని ఇట్టే పట్టేస్తది!.. వాటర్​ పొల్యూషన్​ను నియంత్రించే లీకేజీ డిటెక్టర్
  • వాటర్​బోర్డు అధికారుల చేతిలో సరికొత్త యంత్రం 
  • ‌‌‌‌గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో భారీగా తగ్గిన వాటర్​ పొల్యూషన్​ సమస్యలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​ పరిధి లో తాగునీటి పైపుల్లో లీకేజీని ఈజీగా కనుక్కునేందుకు మెట్రో వాటర్ ​బోర్డు అధికారులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ‘లీకేజీ (పొల్యూషన్) డిటెక్టర్’ అనే యంత్రాన్ని ఉపయోగించి ఎక్కడ లీకేజీ ఏర్పడిందో తెలుసుకుని వెంటనే వాటిని మార్చడం, లేదా రిపేర్​చేయడం ద్వారా కలుషిత నీరు సరఫరా కాకుండా చూస్తున్నారు. ఈ సరికొత్త విధానం వినియోగంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్​లోని చాలా ప్రాంతాల్లో పైప్​లైన్​ లీకేజీల వల్ల ఏర్పడే నీటి కాలుష్యం తగ్గిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న ‘లీకేజీ డిటెక్టర్’ పనితీరును వాటర్​బోర్డు ఎండీ అశోక్​ రెడ్డి ఇటీవల పరిశీలించారు. లీకేజీపై ఫిర్యాదు అందిన వెంటనే మెషీన్​తోపాటు అధికారులను అక్కడికి పంపి సమస్యను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 35 యంత్రాలను కొనుగోలు చేశామని, మరిన్ని యంత్రాలను సమకూర్చుకుంటామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో నీటి కాలుష్యంపై రోజుకు 100 నుంచి 120 ఫిర్యాదులు వచ్చేవని, కానీ లీకేజీ డిటెక్టర్​అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిర్యాదుల సంఖ్య తగ్గి రోజుకు 30 వరకు మాత్రమే వస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

లీకేజీ​డిటెక్టర్ ఇలా పని చేస్తుంది..

గతంలో ఒక పైప్​లైన్​లో లీకేజీని గుర్తించడానికి నాలుగైదు పాయింట్లలో తవ్వాల్సి వచ్చేది. దీని వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా రోడ్లు దెబ్బతినేవి. కొన్ని సందర్భాల్లో లీకేజీ కోసం నెలల తరబడి వెతకాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఎండోస్కోపీ మాదిరిగా పనిచేసే లీకేజీ డిటెక్టర్​ను పైపులైన్​ వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించొచ్చు. మెషీన్ కు ఉన్న సన్నని పైపు చివరలో టార్చి లైటు, కెమెరా ఉంటాయి. ఈ సన్నని పైపు దాదాపు వంద అడుగుల వరకు వెళ్తుంది. దీన్ని లోపలికి పంపే కొద్ది  లైటింగ్​ వల్ల​ పైప్​లోని నీరు, అందులో ఏమేం ఉన్నాయన్నది యంత్రానికున్న మానిటర్​పై స్పష్టంగా కన్పిస్తాయి. ముఖ్యంగా పైప్​లైన్ లీకేజీని ఈజీగా కనిపెట్టొచ్చు. వెంటనే అధికారులు సమస్యను గుర్తించి ఆ ప్రాంతంలో పైప్​లైన్​మార్చడమో, రిపేర్​ చేయడమో చేస్తారు. తద్వారా తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటారు.