మాన్సూన్​ యాక్షన్​ ప్లాన్ ​షురూ

  • డీప్​ మ్యాన్​ హోల్స్ పై సేఫ్టీ గ్రిల్స్ ఫిట్టింగ్
  • రెడ్​ ఫ్లాగ్స్, పెయింటింగ్, డేంజర్​ సైన్​ బోర్డులు ఏర్పాటు
  • వానల టైంలో మ్యాన్​హోల్స్​పొంగకుండా చర్యలు
  • మ్యాన్​హోల్స్​ధ్వంసమైతే ‘155313’కు ఫిర్యాదు చేయొచ్చు

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​పరిధిలో వాటర్​బోర్డు అధికారులు మాన్సూన్ యాక్షన్ ప్లాన్​ను అమలు చేస్తున్నారు. వానా కాలానికి ముందుగా చేపట్టాల్సిన పనులను షురూ చేశారు. భారీ వర్షాలు కురిసిన టైంలో మ్యాన్​హోల్స్​పొంగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సిటీ వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సోమవారం వాటర్​బోర్డు హెడ్డాఫీసులో ఉన్నతాధికారులతో ఎండీ సుదర్శన్​రెడ్డి సమావేశమై మాన్సూన్​ముందస్తు చర్యలపై చర్చించారు.

డైరెక్టర్లు మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపైన స్పెషల్​ఫోకస్​పెట్టాలని ఆదేశించారు.తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. సీవరేజ్​ఓవర్ ఫ్లో, కలుషిత నీటి సమస్యలను ఫిర్యాదు అందిన అరగంటలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. వాటర్ హాట్ స్పాట్లు గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. డీప్​మ్యాన్ హోల్స్ కు సేఫ్టీ గ్రిల్స్ బిగించాలని,  డేంజరస్​మ్యాన్ హోల్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్, సైన్​బోర్డులు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్​పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషీన్లను సమర్థంగా వినియోగించుకోవాలని ఎండీ సూచించారు.

120 వాటర్​ లాగింగ్​ పాయింట్లు 

వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ పరిధిలో 120 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయని, నిత్యం వాటిని పర్యవేక్షించాలని ఎండీ సుదర్శన్​రెడ్డి ఆదేశించారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను(సిల్ట్) ఎప్పటికప్పుడు తొలగించాలని స్పష్టం చేశారు. మంచి నీటి పైప్ లైన్, నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ముంపునకు గురయ్యే మ్యాన్​హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.

రోడ్ల మీద ఉన్న మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని ఆదేశించారు. వాన పడే టైంలో ప్రతి డీప్ మ్యాన్ హోల్​వద్ద సీవరేజ్ సూపర్​వైజర్​ఉండేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు. వానల టైంలో ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్ హోల్స్​మూతలను తెరవకూడదని, వాటర్​బోర్డు సిబ్బంది చూసుకుంటారని చెప్పారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. వాటర్​బోర్డు కస్టమర్ కేర్ నంబర్​155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

63,221 డీప్ ​మ్యాన్​ హోల్స్

జీహెచ్ఎంసీ పరిధిలో 5,767 కిలోమీటర్ల మేర సీవరేజ్ నెట్ వర్క్ ఉంది. శివారు మున్సిపాలిటీల పరిధిలో 4,200 కిలో మీటర్లు ఉంది. జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 6లక్షల34వేల919 మ్యాన్ హోళ్లు ఉండగా, వీటిలో డీప్ మ్యాన్ హోల్స్ 63,221 ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 26,798, శివారు మున్సిపాలిటీల పరిధిలో 36,423 డీప్​మ్యాన్ హోల్స్​ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డీప్ మ్యాన్ హోల్స్ కు ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశారు.

శివారులో గ్రిల్స్ బిగింపు పనులు ఊపందుకున్నాయి. క్షేత్రస్థాయిలో మేనేజర్లు మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, అధికారులు స్థానికంగా పర్యటించి డైలీ సిచువేషన్ రిపోర్ట్(డీఎస్ఆర్) తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాలని ఎండీ సుదర్శన్​రెడ్డి ఆదేశించారు. ప్రతి వాటర్ లాగింగ్ పాయింట్ ఒక వ్యక్తిని నియమించాలని చెప్పారు.