- ఏ పనులు చేద్దామన్నా నిధుల కొరత
- జీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రూ.5వేల కోట్ల అప్పుల్లో బల్దియా
- ఈసారి ఆదుకుంటేనే పనులు ముందుకు సాగే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తొందరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే బల్దియా, వాటర్‌బోర్డు ఆశలు పెట్టుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత జీహెచ్ఎంసీకి ఇప్పటివరకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.10 వేల 874 కోట్లు కేటాయించగా.. ఇందులో 3 శాతం మాత్రమే నిధులు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నిధులు లేకపోవడంతో ఏ పనులు జరగట్లేదు. ఎస్ఆర్డీపీ ఫేజ్–2 పనులు తొందరలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా జీహెచ్ఎంసీ పంపిన రూ.3,500 కోట్ల ప్రపోజల్స్‌కి మాత్రం స్పందించడం లేదు. వరదల నివారణకు ఎస్ఎన్డీపీ ఫేజ్–2 ని కూడా మొదలుపెడ్తామన్నప్పటికీ నిధులు లేక ముందుకు సాగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఫిక్స్డ్ డిపాజిట్ల చరిత్ర ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పుడు రూ.5,275 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ అప్పులకు డైలీ రూ.కోటి 20 లక్షల మిత్తి చెల్లిస్తోంది. కనీసం ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి రూ.5,564 కోట్ల బకాయిలైన విడుదల చేస్తే జీహెచ్ఎంసీ గట్టెక్కుతుందని ఎక్స్పర్ట్స్అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సర్కారు 9వసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. మరి ఈసారైనా కేటాయించిన నిధులను రిలీజ్ చేయాలని బల్దియా అధికారులు కోరుతున్నారు.
ప్రతి ఏటా అంతే..
ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి నయా పైసా రావడం లేదు. కేటాయించిన ఫండ్స్‌ని రిలీజ్ చేయడం లేదు. 2014–15 బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రూ.375.93 కోట్లు కేటాయించిన సర్కార్ రూ.288.14 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. 2015–16 లో రూ.428 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.23 కోట్ల తోనే సరిపెట్టింది. 2016–17లో రూ.70.30 కోట్లు కేటాయించి రూ.1.32 కోట్లే ఇచ్చింది. 2017–18లో ప్రణాళికేతర నిధుల కింద రూ.67.28 కోట్లు ఇస్తామని చెప్పినా ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. 2018–19, 2019–20 బడ్జెట్లలో అసలు నిధులే కేటాయించలేదు. 2020–21లో నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించి అందులో బల్దియాకి కేవలం రూ.17 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2021–22 లోనూ కేటాయించలేదు. 2022–23 లో రూ.2,500 కోట్ల నిధులు కావాలంటూ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ లెటర్ రాసింది. కానీ నిరాశే మిగిలింది. ఈ సారి కూడా రూ.2,500 కోట్లు కావాలని అడిగినప్పటికీ ఎంత ఇస్తుందో వేచి చూడాలని అధికారులు అంటున్నారు.
ఏడాదికి రూ.400 కోట్లకుపైగా వడ్డీ..
స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్డీపీ) కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే ఎస్బీఐలో 8.65 శాతం వడ్డీ కింద రూ.2,500 కోట్లు, కాంప్రహెన్సివ్రోడ్మెయింటెనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1,460 కోట్లు, మళ్లీ ఎస్ఆర్డీపీ పనుల కోసం బాండ్ల ద్వారా రూ.490 కోట్లు వడ్డీకి తీసుకుంది. వాంబే హౌసింగ్ స్కీం కోసం రూ.140 కోట్లను హడ్కో నుంచి తీసుకుంది. ఇందులో రూ.100 కోట్లకు 10.15 శాతం, రూ.40 కోట్లకు 9.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. వీటితో పాటు నాలాల పనుల కోసం రూ.685 కోట్ల అప్పు చేసింది. ఇవన్నీ కలిపి మొత్తం రూ.5,275 కోట్ల అప్పు జీహెచ్ఎంసీ నెత్తిపై ఉంది. ఈ అప్పులకు సంబంధించి ఏడాదికి రూ.400 కోట్లకుపైగానే వడ్డీ చెల్లిస్తోంది.
వాటర్బోర్డుదీ అదే పరిస్థితి..
20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ స్కీమ్అమల్లోకి వచ్చిన తరువాత వాటర్ బోర్డు ఆమ్దానీ ఒక్కసారిగా పడిపోయింది. కరోనా తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఫండ్స్ లేక కరెంట్ బిల్లులను సైతం చెల్లించలేని దీన పరిస్థితిలో వాటర్ బోర్డు ఉంది. ఇప్పటికే రూ.3,500 కోట్ల బకాయిలు పడింది. ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ కోసమే ప్రతి నెలా దాదాపు రూ.65 కోట్ల అవసరముండగా.. నెలకి రూ.60 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. వాటర్బోర్డ్పరిధిలో ఎస్టీపీల నిర్మాణం, ఓఆర్ఆర్ ఫేజ్–2, సుంకిశాల తదితర పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో రూ.5 వేల కోట్ల ప్రతిపాదనలను వాటర్బోర్డ్ ప్రభుత్వానికి పంపింది. బడ్జెట్లో ఈ నిధులను కేటాయిస్తేనే గట్టెక్కే అవకాశం ఉంది. నిధులు లేక ఆగిన పనులు ఫండ్స్ లేకపోవడంతో ఇప్పటికే సిటీలో చాలా పనులు నిలిచిపోయాయి. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా టైమ్ కి అందడం లేదు. భారీ వర్షాలకు రోడ్లు డ్యామేజ్ కావడంతో పాట్ హోల్స్‌ను పూడ్చేందుకు కూడా నిధులు లేని పరిస్థితి. డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో ఇండ్ల నిర్మాణం కూడా స్లోగా జరుగుతోంది. ఎస్ఆర్ డీపీ ఫేజ్–1 పనులు కూడా స్లోగా సాగుతున్నాయి. ఎస్ఎన్డీపీ పనుల కాంట్రాక్టర్లకు బిల్లులు అందడంలేదు. పార్కుల మెయింటెనెన్స్, ఉద్యోగులు, కార్మికుల వేతనాలు.. ఇలా జీహెచ్ఎంసీ చేపట్టే అన్ని పనులపై నిధుల ప్రభావం తీవ్ర స్థాయిలో చూపుతోంది.
జీహెచ్ఎంసీని ఆదుకోవాలి..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇస్తున్న రిపోర్టుని అమలు చేయడం లేదు. దాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం లేదు. తెలంగాణలోని 35 శాతం జనాభా సిటీలో ఉంది. రాష్ట్ర ఆదాయంలో 70 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోంది. జీహెచ్ఎంసీని ఆదుకోవాలని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్‌కి కూడా లెటర్ రాశాం. జీహెచ్ఎంసీకి సరిపడా ఫండ్స్ ఇవ్వడం లేదు. ఇచ్చిన నిధులు మెయింటెనెన్స్ కు కూడా సరిపోవట్లేదు. ఈ ఏడాది బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించి.. వాటిని వెంటనే రిలీజ్ చేయాలి.
–ఎం పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ సెక్రటరీ