జీహెచ్ఎంసీ వెబ్​సైట్​ను.. అప్​డేట్ చేయట్లే

జీహెచ్ఎంసీ వెబ్​సైట్​ను..   అప్​డేట్ చేయట్లే
  • ఆఫీసర్ల వివరాలన్నీతప్పుల తడకనే
  • ఉన్న ఫోన్ నంబర్లు కలవవు.. కలిసినా ఎవరూ లిఫ్ట్ చేయరు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ వెబ్​సైట్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం లేదు. ఆఫీసర్ల వివరాలను అందుబాటులో ఉంచడటం లేదు. ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారో సిటిజన్స్ కు తెలియని పరిస్థితి నెలకొంది. కమిషనర్, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల ల్యాండ్ లైన్ నంబర్లను మాత్రమే సైట్​లో పెడుతున్నారు. సెల్​ఫోన్​నంబర్లను అందుబాటులో ఉంచడం లేదు. ఉన్న ఫోన్ నంబర్లు కొన్ని కలవడం లేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల కోసం ప్రత్యేకంగా కాలమ్​ఉన్నప్పటికీ వారి వివరాలు ఉంచడం లేదు. వెటర్నరీ, శానిటేషన్, ఫుడ్ సేఫ్టీ అధికారుల వివరాలు మొత్తానికే లేవు. ముషీరాబాబాద్, సంతోష్​నగర్ డిప్యూటీ కమిషనర్ల నంబర్లు సైట్​లో అందుబాటులో లేవు. జీహెచ్ఎంసీలో సపరేట్​గా ఐటీ వింగ్ ఉన్నప్పటికీ నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. టెక్నాలజీని వాడుకోవడంలో జీహెచ్ఎంసీ ముందు ఉంటోందని చెబుతున్న అధికారులు.. సంస్థ మెయిన్​వెబ్ సైట్​నిర్వహణను పట్టించుకోవడంలేదు. సైట్ ను అప్ డేట్ చేయడం లేదని ఉమేష్ కుమార్ అనే సిటిజన్ మూడ్రోజుల క్రితం మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ట్యాగ్​చేసి ట్వీట్ చేశాడు. స్పందించిన మేయర్ సైట్​ను అప్ డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ పెద్దగా మార్పు కనిపించడం లేదు. 

జనం సొమ్ముతో బిల్లులు..

అధికారులు ఫోన్​లిఫ్ట్​చేయకపోవడంతో చిన్న సమస్యకు కూడా జనం బల్దియా ఆఫీసులకు క్యూ కడుతున్నారు. సర్కిల్ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు కొందరు మినహా మెజారిటీ అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. సర్కిల్ స్థాయి అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు చెబుదామంటే వాళ్ల నంబర్లు వెబ్ సైట్​లో అందుబాటులో లేవు. నంబర్లు తెలుసుకొని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదని జనం ఆరోపిస్తున్నారు. ల్యాండ్ లైన్ నంబర్లకు కాల్ చేస్తే రెస్పాన్స్ ఉండడం లేదని వాపోతున్నారు. బల్దియా కమిషనర్ నుంచి కింది స్థాయి అధికారి వరకు ఫోన్ల బిల్లులను సంస్థనే చెల్లిస్తోంది. గతంలో అధికారుల నంబర్లను ఎప్పటికప్పుడు వెబ్ సైట్​లో అప్​డేట్ చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొందరు అధికారులు కేవలం తమకు అవసరమున్న వారికి మాత్రమే రెస్పాండ్​అవుతున్నారు. ఎప్పుడూ మీటింగ్ లో ఉన్నామని దాటుకుంటున్నారే తప్ప జనానికి మాత్రం రెస్పాండ్​కావడం లేదు. డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ వింగ్ ఇలా ఎవరికి కాల్ చేసినా మెజారిటీ అధికారులు ఫోన్లకు స్పందించడం లేదు.