ఇంకుడు గుంతలు లేనోళ్లకు గుడ్ ​న్యూస్.. ట్యాంకర్లకు డబుల్​ చార్జీల్లేవ్

ఇంకుడు గుంతలు లేనోళ్లకు గుడ్ ​న్యూస్.. ట్యాంకర్లకు డబుల్​ చార్జీల్లేవ్
  • నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న వాటర్​బోర్డు​
  • ఇప్పటివరకు 17 వేల మందికి నోటీసులు  
  • వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు నిర్ణయం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోని వారందరికీ వేసవిలో ట్యాంకర్లు బుక్​చేసుకుంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వాటర్​బోర్డు ఈ ఏడాదికి ఉపసంహరించుకుంది. గత సంవత్సరం కొన్ని ప్రాంతాల నుంచే భారీ సంఖ్యలో వాటర్​ట్యాంకర్లు బుక్​కావడంపై ఆరా తీసిన వాటర్​బోర్డు సర్వే చేసింది. ఇంకుడు గుంతలు నిర్మించుకోని కారణంగానే బోర్లు ఎండిపోయి అధికంగా​ట్యాంకర్లు బుక్​చేసుకుంటున్నట్టు గుర్తించింది. 

ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచనలు చేసింది. నిర్మించుకోని వారు ట్యాంకర్లు బుక్​చేస్తే డబుల్​ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది లెక్కనే ఈసారి కూడా అవే ప్రాంతాల నుంచి భారీగా ట్యాంకర్లు బుక్​అవుతున్నట్టు తెలుసుకుని రెట్టింపు ఛార్జీలు వసూలుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే, సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడం, ఈ ఏడాదే నిర్మించుకున్న ఇంకుడు గుంతలతో ప్రయోజనం ఉండే అవకాశం లేకపోవడంతో వచ్చే ఏడాది వేసవిలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్​అయ్యింది. దీంతో ఈసారి ట్యాంకర్​బుక్​చేస్తే అందరి లెక్కనే ఛార్జీలు వసూలు చేయనున్నది.  

వెస్ట్​ సిటీలోనే ఎక్కువ ..

గ్రేటర్​ పరిధిలో కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్, ఎస్ఆర్​నగర్​, కుత్బుల్లాపూర్​, హైటెక్​సిటీ, ఐటీ కారిడార్​ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బోర్లు ఎండిపోయాయి. భారీ సంఖ్యలో ట్యాంకర్లను బుక్​చేస్తున్న వారి వివరాలు సేకరించగా వెస్ట్​సిటీ నుంచే దాదాపు 42 వేల మంది 90 శాతం బుక్​చేస్తున్నట్టు తేలింది. వీరి ఇండ్లకు వెళ్లి తనిఖీలు చేసి ఇంకుడు గుంతలు లేని 17వేల మందికి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలింగ్​కూడా ఇవ్వగా ఐదువేల మంది నిర్మించుకున్నారు. 

నిర్మించుకోని వారిపై ఒత్తిడి తేవడంలో భాగంగా వాటర్​ట్యాంకర్​బుక్​చేస్తే డబుల్​ఛార్జీ వసూలు చేస్తామని వార్నింగ్​ఇచ్చింది. ఇప్పుడు నిర్మించిన ఇంకుడు గుంతలు ఏ విధంగా పని చేస్తున్నాయన్నది వచ్చే వర్షాకాలంలో తెలుస్తుంది కాబట్టి ఈ ఏడాది ట్యాంకర్ల బుకింగ్​లపై అదనపు ఛార్జీల వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన లేదని సమాచారం.