హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చింది. దీంతో బల్దియా ఆఫీస్ ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. కార్మికుల నిరసన ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బల్దియాకు సంబంధించిన 6 జోనల్ ఆఫీసుల ముందు నిరసన నిర్వహించిన ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఇవాళ చలో ప్రగతి భవన్ కు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది.
నిరసన కార్యక్రమం సజావుగా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా దాదాపు 200 మందికిపైగా పోలీసులు జీహెచ్ఎంసీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రగతి భవన్ ముందు చెత్తపోసి తమ నిరసన తెలియజేస్తామని అంటున్నారు. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని.. అలాగే జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.