హైదరాబాద్ టూరిస్ట్ ప్లేసుల్లో హుస్సేన్ సాగర్ ఒకటి. సాగర్ ను అందంగా ఉంచడానికి..నిత్యం వందల మంది కార్మికులు పనిచేస్తుంటారు. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తీసేస్తుంటారు. కంపుకొట్టే దుర్వాసనలో కూడా జీవన పోరాటం చేసేవారు కొందరైతే..సాగర్ చుట్టూ ఉండే పార్కుల్లో వివిధ రకాల పనులు చేస్తూ.. జీవితం గడుపుతున్నారు ఇంకొందరు. టన్నుల కొద్ది చెత్తను తీసేందుకు హెచ్ఎండీఏ అధికారులు యంత్రాలను తీసుకొచ్చినా. చివరికి కార్మికులు సాగర్లో దిగి పనిచేయాల్సిందే. ఈ చెత్త తొలగింపులో 90 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ లో చెత్త ఏరి.. ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుంటారు.
సాగర్లో దిగి పనిచేసే కార్మికులకు ప్రతిరోజు 370 రూపాయల చొప్పున చెల్లిస్తోంది హెచ్ఎండీఏ. పనిచేసిన రోజే కార్మికులకు వేతనం వస్తుంది. వీళ్ళకి కనీస వసతులను కూడా కల్పించడం లేదు. సాగర్ నుంచి చెత్తా చెదారంతో పాటు చనిపోయిన జంతువుల కళేబరాలను కూడా తొలగిస్తుంటారు. చాలా సందర్భాల్లో కార్మికులకు సీసా ముక్కలు దిగి.. గాయాల బారిన పడుతున్నారు. కనీసం కార్మికులకు గ్లోవ్స్, షూలు, సోప్ లు, డ్రెస్సులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్ల తరబడిగా సాగర్లో చెత్తాచెదారం తొలగిస్తూ..అనారోగ్యం బారిన పడుతున్నా….తమను పట్టించుకునేవాళ్ళే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇప్పటి వరకు తమక ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేసిన రోజే జీతం. లేదంటే పస్తులుండాల్సిందేనని చెబుతున్నారు. ఇక సాగర్ చుట్టూ ఉన్న పార్కుల్లో వందల మంది కార్మికులు పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. గార్డెన్ పనులు, హౌజ్ కీపింగ్, ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్ పనుల కోసం 334 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి రోజు వీరు ఆయా పార్కుల్లో చెత్తాచెదారం తొలగించడంతో పాటు ఇతర పనులు చేస్తున్నారు. ఈఎస్ఐ, పీఏఫ్ కటింగ్ పోను ప్రతి నెలా 8 వేల లోపే చెల్లిస్తున్నారు అధికారులు.