- సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
- లేదంటే 23 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిక
- జోనల్ కమిషనర్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ జీహెచ్ఎంసీ కార్మికులు పోరు బాట పట్టారు. ఈ నెల 23లోపు సర్కార్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో సమ్మె కు దిగుతామని బీజేపీ అనుబంధ సంఘమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (జీహెచ్ఎంఈయూ) డెడ్ లైన్ విధించింది. మొత్తం 18 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్ ను కమిషనర్ లోకేశ్ కుమార్ కు ఇటీవల అందజేసింది. కానీ ఇప్పటి వరకు సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరో 10 రోజులే గడువు ఉండడంతో కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని జోనల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం చార్మినార్ జోనల్ ఆఫీసు ఎదుట ఆందోళన చేయనున్నారు.
కార్మిక సంఘాలతో మీటింగ్ లు..
సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని జీహెచ్ఎంఈయూ నేతలు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన కోసం కలసికట్టుగా పోరాడాలన్నారు. ఆదివారం నుంచి ఒక్కో యూనియన్ నాయకులతో సమావేశమై, వారి మద్దతు కోరనున్నారు. అందరి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని, ఎవరూ మద్దతు ఇచ్చినా ఇయ్యకున్నా తాము సమ్మెకు వెళ్తామని నేతలు అంటున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు, పెండింగ్ డీఏల చెల్లింపు, గ్రేటర్ జనాభాకు అనుగుణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెంపు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మినహాయింపు, రూ.25 వేల జీతం, ఉచిత బస్ పాస్, చనిపోతే రూ.25 లక్షల ఆర్థిక సాయం, ప్రతి నెల ఒకటో తేదీనే జీతాల చెల్లింపు, పర్మనెంట్ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు, బల్దియా పనులకు సంబంధించి ప్రైవేట్ సంస్థలతో కాంట్రాక్టుల రద్దు.
హామీలు నెరవేర్చాలె...
ఉద్యమ నేతగా ఇచ్చిన హామీలను సీఎం అయ్యాక కేసీఆర్ నెరవేర్చడం లేదు. కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలె. ఈ నెల 22లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలె. లేకపోతే 23 నుంచి సమ్మెకు దిగుతాం.
- ఊదరి గోపాల్, ప్రెసిడెంట్, జీహెచ్ఎంఈయూ