- సిటీలో బల్దియా బృందాల తనిఖీ
- ఉల్లంఘనలకు భారీగా జరిమానా
- పారిశుధ్య నిర్వహణపై సీరియస్
హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ నిబంధనలపై ప్రజలకు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రూల్స్ పాటించని వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపిస్తోంది. నగర పరిశుభ్రతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. స్వచ్ఛత ఉల్లంఘనలకు పాల్పడే వారిని అక్కడికక్కడే పట్టుకుని జరిమానా విధిస్తోంది. ఈ నేపథ్యంలో బల్దియా బృందాలు నిఘా పెంచాయి. పబ్లిక్ ప్లేస్ లో తిరుగుతూ జరిమానాలు విధిస్తున్నాయి.
రోడ్లపై ఉమ్మివేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, నాలాల్లో చెత్త పడేయడం ఇలా ఒక్కో ఉల్లంఘనకు రూ.100 నుంచి రూ.10,000 వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో విధించిన జరిమానాలలో ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం, సర్టిఫై చేయని మాంస విక్రయాలు, హోటల్ లలో పరిశుభ్రత పాటించకపోవడం, అక్రమంగా బ్యానర్లు ఏర్పాటు కేసులే ఉన్నాయి. ఈ ఘటనల నుంచి అధిక మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తోంది. మే 25వ తేదీ నుంచి అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 2809 మంది వ్యక్తులు, సంస్థలకు రూ. 44,04,950 లక్షలు జరిమానాలు విధించారు.