కేంద్రం, రాష్ట్రం పన్ను బకాయిలు కడితే GHMC అప్పులు ఎగిరిపోతయ్..!

కేంద్రం, రాష్ట్రం పన్ను బకాయిలు కడితే GHMC అప్పులు ఎగిరిపోతయ్..!
  • జీహెచ్ఎంసీకి కట్టాల్సిన ఆస్తి పన్ను రూ.5 వేల కోట్లు
  • డిమాండ్ ​నోటీసులు ఇచ్చిన కమిషనర్​ 
  •  కేంద్రానికి చెందిన 15 , రాష్ట్రంలోని 18 డిపార్ట్​మెంట్లకు సమన్లు  
  • సెంట్రల్​ నుంచి రూ.400 కోట్లు, స్టేట్ నుంచి రూ.4,600 కోట్లు పెండింగ్​
  • ప్రైవేట్, గవర్నమెంట్ ​కలిపి రావాల్సింది రూ.11వేల కోట్లు 

హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: ప్రభుత్వ భవనాలపై ఉన్న రూ.5 వేల కోట్ల ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాలని బల్దియా ఆయా శాఖలు, సంస్థలకు రెండురోజుల కింద డిమాండ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు కలిపి15, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కలిపి18 డిపార్ట్​మెంట్లకు ఈ నోటీసులు ఇచ్చింది. ఇందులో కేంద్రానికి సంబంధించిన రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఇన్​కమ్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిపి మొత్తం 400 ప్రాపర్టీలకు సంబంధించి రూ.400 కోట్ల బకాయిలు ఉన్నాయి. 

రైల్వే నుంచే రూ.110 కోట్లు రావాల్సి ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి హెల్త్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్, పోలీస్​శాఖలు కలిపి మొత్తం 2 వేల ప్రాపర్టీల బకాయిలు రూ.4,600 కోట్ల వరకు ఉన్నాయి. సర్కిల్ ఆఫీసుల నుంచి రెగ్యులర్‎గా నోటీసులు వెళ్తున్నా స్పందన లేకపోవడంతో ఈసారి జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో హెడ్డాఫీస్​నుంచి డిమాండ్ నోటీసులిచ్చారు. 

కేంద్రానికి సంబంధించిన బకాయిలు యేటా దాదాపు రూ.20 కోట్ల వరకు పన్ను చెల్లిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత పదేండ్లలో కేవలం రూ.54 కోట్లు మాత్రమే చెల్లించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు దాదాపు రూ.6,300కోట్లు అప్పు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను బకాయిలను క్లియర్​చేస్తే బల్దియా అప్పు దాదాపుగా తీరుతుంది. సిటీలో అభివృద్ధి పనులకు ఫండ్స్​కొరత కూడా తీరుతుంది. సంస్థ అప్పుల ఊబిలో నుంచి బయటపడుతుంది. 

సగం ప్రభుత్వ బకాయిలే..

వారం రోజులుగా గ్రేటర్‎లో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలున్న వారికి బల్దియా వారెంట్లు జారీ చేయడంతో పాటు ఆస్తులు సీజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే పనిగా ప్రాపర్టీ ట్యాక్స్​కలెక్షన్స్​కోసం తిరుగుతున్నారు. ఆఫీసర్లు వెళ్లిన టైంలో ప్రాపర్టీదారుల వద్ద డబ్బులు లేకపోతే చెక్కులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బల్దియాకు రావాల్సిన మొత్తం బకాయి రూ.11వేల కోట్లు కాగా, ఇందులో సగం ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లడంతో చర్చకు ఆస్కారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. 

ప్రభుత్వం కడుతుందన్న ఆశతో..

ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన బకాయిలు మొత్తం చెల్లిస్తే జీహెచ్ఎంసీకి ఉన్న అప్పులన్నీ ఎగిరిపోయతాయి. అంతేకాకుండా బల్దియాపై రోజూ రూ.కోటి భారం తగ్గుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటికప్పుడు బల్దియాకు బకాయిలు చెల్లించేవారు. బీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చాక చెల్లించకపోవడంతో భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్​సర్కారు అధికారంలోకి వచ్చాక పెట్టిన తొలి బడ్జెట్‎లోనే బల్దియాకు రూ.3,065 కోట్లు కేటాయించింది. ఇందులో సగం నిధులు విడుదల చేసింది. 

అయితే బీఆర్ఎస్​హయాంలో కట్టకుండా మిగిలిన బకాయిలు సర్కారుకు భారంగా మారడంతో చెల్లించలేకపోయింది. కానీ, జీహెచ్ఎంసీకి స్టాంప్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ నుంచి రావాల్సిన రూ.3,030 కోట్ల స్టాంప్ డ్యూటీని రెండునెలల క్రితం రిలీజ్ చేసింది. ప్రాపర్టీ ట్యాక్స్‎‎కి సంబంధించిన నిధులు కూడా ఇలాగే ఒకేసారి రిలీజ్​చేస్తుందన్న ఆశతో బల్దియా నోటీసులు జారీ చేసింది. ఒకవేళ సర్కారు ట్యాక్స్​సొమ్ము ఇస్తే బల్దియాకు అప్పుల భారం పోయి అభివృద్ధిపై దృష్ట పెట్టే అవకాశం ఉంటుంది.