- బల్దియా ‘చెత్త’ మేనేజ్‌మెంట్
- డంపింగ్ ప్రాంతాలుగా పార్కులు, ఖాళీ స్థలాలు
హైదరాబాద్, వెలుగు: ‘‘నీతులు చెప్పేందుకే తప్పా.. పాటించేందుకు కాదు’’ అన్నచందంగా ఉంది జీహెచ్‌ఎంసీ పరిస్థితి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ఇండ్ల వ్యర్థాలు వేస్తే లక్షల్లో ఫైన్ వేసి జీహెచ్‌ఎంసీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలపైకి ‘దండం’ పట్టుకుని బయలుదేరింది. అయితే జీహెచ్‌ఎంసీ ఆధీనంలోని పార్కుల్లో పాత టైర్లు, ఖాళీ డ్రమ్ములు, చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నాయి. మరిప్పుడు జీహెచ్‌ఎంసీకి ఏ అధికారి జరిమానా విధిస్తారో తెలియడం లేదు. జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు, పార్కులు చెత్త, పనికిరాని వస్తువులకు డంపింగ్ యార్డులుగా మారిపోతున్నాయి. భవన నిర్మాణ వ్యర్థాలు తరలించేందుకు చర్యలు చేపట్టామని చెబుతుండగా.. నగరంలోని రోడ్ల పక్కన బహిరంగంగా చెత్త డంపులు, ఇతర వ్యర్థాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ నుంచి నగరానికి ఓడీఎఫ్++ గా ప్రకటించే అవకాశం ఉండటంతో బల్దియా పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టింది. అయితే తన సొంత ఆస్తుల్లోనే చెత్త, నిర్వహణ అధ్వానంగా ఉంది.
మొదటి సన్మానం బల్దియా అధికారులకే..
ఓపెన్ గార్బేజ్ పాయింట్లను తొలగించి, బహిరంగంగా చెత్త వేయడాన్ని నిర్మూలించేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ పలు సూచనలు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా బహిరంగంగా చెత్తవేసే వారిని సన్మానించడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని అధికారులకు సూచించారు. కానీ.. నల్లగండ్లలోని జీహెచ్‌ఎంసీ పార్కులో భారీ స్థాయిలో నిరుపయోగ టైర్లు, ఖాళీ డ్రమ్ములు డంప్ చేస్తే పట్టించుకునేవారు లేరు. పబ్లిక్ పార్కును డంపింగ్ యార్డుగా మార్చిన జీహెచ్‌ఎంసీకి అధికారులకే సన్మానం చేయాలని ప్రజలు అంటున్నారు.
స్పెషల్ డ్రైవ్ ఫలితాలు వచ్చేనా..
గ్రేటర్ లో రెగ్యులర్‌గా చెత్త సేకరణ సాగుతున్నా.. ప్రజలు ఎక్కడికక్కడే చెత్త పారేస్తున్నారు. నగరంలో 1,116 ఓపెన్ గార్భేజ్‌లున్నట్టు గుర్తించిన బల్దియా వాటిని తొలగించింది. వాటిలో కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కాలంలో తిరిగి చెత్త వేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. భవన వ్యర్థాలు తొలగించేందుకు, చెత్త తరలింపు కోసం నగరంలో ప్రతీ సర్కిల్‌కు అదనంగా నాలుగు టిప్పర్లు, రెండు బాబ్‌కాట్‌లను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ను క్లీన్‌గా ఉంచేందుకు 256 టిప్పర్లతో కలిపి మొత్తం 532 వాహనాలతో పెద్ద ఉద్యమమే చేపడుతున్నారు. అయినా రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త కనిపిస్తూనే ఉంది.
ప్రజలకు చేరువ కాని బల్దియా
నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు బల్దియా అధికారులు నిత్యం ప్రణాళికలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ జరిమానాలు, కొత్త సూచనలతో ముందుకొస్తున్నారు. అయితే ఇవి ఏ మేరకు సత్ఫలిస్తున్నాయో అధికారులు తెలుసుకోవడం లేదు. నగరంలోని ప్రధాన, అంతర్గత రోడ్ల పక్కన చెత్త, చెదారం, మట్టిదిబ్బలే దర్శనమిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పార్కులు సైతం డంపింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. భవన నిర్మాణ వ్యర్థాలు, ఇండ్లలో చెత్త వ్యర్థాలు తరలించేందుకు ప్రత్యేకంగా వ్యవస్థలను ఏర్పాటు చేసిన బల్దియా ఆ సమాచారాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరముంది. అవగాహన, సమాచారం లేకపోవడంతోనే రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త డంప్ చేస్తున్నారు.