హైదరాబాద్, వెలుగు: వారం వారం నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు సరిగా జరగడం లేదు. కౌన్సిల్ఏర్పడిన 8 నెలల తర్వాత కమిటీని ఎన్నుకున్నారు. లేటుగా ఎన్నుకున్నా సిటీ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సమావేశమై సమస్యలపై చర్చిస్తారనుకుంటే అదీ లేదు. 32 వారాలకు గాను ఇప్పటివరకు కేవలం12 సార్లు మాత్రమే స్టాండింగ్కమిటీ సమావేశం నిర్వహించారు. 150 మంది కార్పొరేటర్లలో15 మందిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కమిటీకి మేయర్ అధ్యక్షులుగా ఉంటారు. ప్రతివారం కమిటీ మీటింగ్ పెట్టి రెగ్యులర్‌గా జరగాల్సిన పనులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చే అవకాశం కమిషనర్‌కు ఉంటుంది. అంతకు మించి రూ.5 కోట్ల వరకు అయితే స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తప్పనిసరి. ఇంత కీలకమైన కమిటీ మీటింగ్ రెగ్యులర్‌గా జరగడం లేదు. ఫలితంగా అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో కమిటీ ఏర్ప
డగా కేవలం 12 సమావేశాలు నిర్వహించారు. జరిగిన వాటిలోనూ పెద్ద పనులపై చర్చించడం లేదు. ఇప్పటివరకు మొత్తం 150 అంశాలకు సభ్యులు ఆమోదం తెలపగా ఇందులో ఎక్కువగా సర్వీసుకు సంబంధించినవే ఉన్నాయి. మరికొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద వచ్చిన నిధులు ఖర్చు చేసేందుకు అనుమతులు ఇచ్చినవి ఉన్నాయి. ఇలా సాధారణ అంశాలతోనే సమావేశాలు ముగించేస్తున్నారు. కొన్నిసార్లు పూర్తి స్థాయిలో చర్చలు జరగడం లేదన్న ఆరోపణలున్నాయి.
అంతా నిర్లక్ష్యమే..
గ్రేటర్ ఎన్నికలు తర్వాత కౌన్సిల్ ఏర్పాటుతోపాటు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు కార్పొరేటర్లు 2 నెలల పాటు వెయిట్చేశారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కోసం మరో 8 నెలలు వెయిట్ చేశారు. ఇంత లేట్అయినా ఎన్నికైన కమిటీ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పటివరకు జరిగిన కొన్ని సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం కౌన్సిల్ ఏర్పడిన తర్వాత పాలనలో పౌరుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒక్కో వార్డు కమిటీలో100 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అంటే గ్రేటర్ లో 15వేల సభ్యులను ఎన్నుకోడానికి అవకాశం ఉంది. కానీ ప్రతిసారి నామమాత్రంగా 10 నుంచి 15 మందిని ఎన్నుకొని వదిలేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు వెయిట్ చేస్తూనే ఉన్నారు.