బీజేపీకి నా అవసరం లేదనుకుంటా... నా బలం ఏంటో చూపిస్తా

బీజేపీకి  నా అవసరం లేదనుకుంటా... నా బలం ఏంటో చూపిస్తా
  • గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై రాజాసింగ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ మరో నాలుగు జిల్లాలకు ప్రెసిడెంట్లను ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా సి.గోదావరి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్​ గౌడ్, గోల్కొండ గోషా మహల్​ జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేంద్ర , మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వల్లభు వెంకటేశ్వర్లను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర  సంస్థాగత ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.  

నేనిచ్చిన పేరు లేదు: రాజాసింగ్ 

గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేంద్ర పేరును ప్రకటించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ఆడియోను రిలీజ్ చేశారు. తన సెగ్మెంట్ నుంచి తాను సూచించిన పేరు కాకుండా.. వేరే వారికి జిల్లా అధ్యక్షుడిగా నియమించారని చెప్పారు. మంచి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా.. వేరే వ్యక్తికి ఇచ్చారని పేర్కొన్నారు. దీన్ని బట్టి పార్టీకి తమ అవసరం లేదని భావిస్తున్నామని తెలిపారు. ముందుముందు మా బలం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.