జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అనే పేరును పెట్టారు. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో పార్టీ జెండాను తీర్చిదిద్దారు. కాంగ్రెస్ కు ఆజాద్ రాజీనామా చేసిన నెల రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తమ పార్టీ పేరు కోసం 1500 పేర్లను పలువురు సూచించారని అజాద్ చెప్పారు.
ప్రజాస్వామిక, శాంతియుత, స్వతంత్రతలను ప్రతిబింబించే పేరు పెట్టాలని తాము కసరత్తు సాగించామని ఆజాద్ తెలిపారు. తమ పార్టీ మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తమ పార్టీ జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే పరిమితం అవుతుందని భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు. ఆజాద్ 2005 నుండి 2008 వరకు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. త్వరలోనే జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి.