మునుపెన్నడు లేని సంక్షోభంలో కాంగ్రెస్​

పార్టీలో ఉండి చేయలేకపోయిన మేలు కాంగ్రెస్ కు, గులామ్ నబీ ఆజాద్ పార్టీ వీడి చేయనున్నారా? ఏమో, పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. వెళ్తూ వెళ్తూ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. ఆయన మంచివాడే కానీ, అసమర్థుడు–అయోగ్యుడు అన్న భావన స్ఫురించేలా ఘాటైన విమర్శ చేశారు. పార్టీ ప్రసుత దుస్థితికి రాహుల్ కారకుడనీ అన్నారు. ఇన్నాళ్లు అన్నీ అనుభవించి, ఆజాద్ చేసింది తప్పా? ఒప్పా? అనే చర్చకు కాంగ్రెస్ లోపల–బయట ఎవరూ ఆసక్తి చూపటం లేదు. కాంగ్రెస్​ను వీడిన ఆజాద్ ఏమవుతారు? కొత్తగా పార్టీ పెడతారా? బీజేపీ పంచన చేరతారా? వారి అండతో కశ్మీర్​కు మరోమారు ముఖ్యమంత్రి అవుతారా? అన్న ఆసక్తి కూడా ఎవరిలోనూ లేదు.  కానీ, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ మీద ఆయన ఆరోపణల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అన్నది ఇపుడు కీలక ప్రశ్న. ‘పార్టీకి అన్నీ అయిన గాంధీ–నెహ్రూ కుటుంబీకులు ముగ్గురు  సోనియా, రాహుల్, ప్రియాంకలు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికను ఎంత సీరియస్​గా తీసుకుంటున్నారు?’ అన్నదానిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడనుంది.

వ్యతిరేక గళం విప్పిన జి–23 సంధించిన అనేకానేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానమే రాలేదు. నాయకత్వ వైఖరీ మారలేదు. ఈ లోపు పలువురు ముఖ్యులు పార్టీ వీడారు. ఈ నిష్క్రమణలు అనే కాదు, ఇన్నేళ్ల చరిత్రలో, ఇంత సంక్షోభం కాంగ్రెస్ కు మునుపెన్నడూ లేదు. దీన్నుంచి పార్టీ బయటపడుతుందా? మరింత అధ్వానస్థితికి దిగజారుతుందా? అన్నది తదుపరి అధ్యక్షుడెవరు? ఎలా పనిచేస్తారు? అన్నదాన్ని బట్టి ఉంటుంది. అంతటి కీలకమైన అంశాన్ని నిర్ణయించేటప్పుడు, తాజాగా ఆజాద్ లేవనెత్తిన అంశాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారనేది? కోటి రూకల ప్రశ్న! 

ఏం జరగొచ్చు?
వాయిదా పడి, అక్టోబరు17, 19 కి తేదీలు ఖరారైన అధ్యక్ష ఎన్నిక ఎలా ఉండబోతోందనే విషయంలో ఒక స్పష్టత లేదు. ఇప్పటి వరకు కొన్ని సంకేతాలు మాత్రమే వెలువడ్డాయి. సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్​ను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని అధిష్టానం అడగటం, ఆయన సున్నితంగానే తిరస్కరించి, రాహులే ఉండాలనడం తెలిసిందే! అంటే, నిజంగానే ఆ కుటుంబం అధ్యక్ష పీఠం నుంచి వైదొలగాలనుకుంటోందా? ఇది తేలాలి. ‘ఏం చేసైనా,  పగ్గాలు చేపట్టేలా రాహుల్ పైనే ఒత్తిడి తెచ్చి, ఆయన్నే ఒప్పిస్తామ’ని పార్టీ మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నట్టు వార్తలొచ్చాయి. ఇలా వ్యక్తమైన సదరు సంకేతాల్ని బట్టి రెండు సీనారియోల్లో ఏదో ఒకటి జరిగే ఆస్కారం కనిపిస్తోంది. పార్టీలోని వ్యక్తి ఆరాధకుల మాట, ఒత్తిడి నెగ్గి అదే కుటుంబంలోని వ్యక్తి, బహుశా రాహుల్ గాంధీయే తిరిగి అధ్యక్షస్థానాన్ని అలంకరించడం ఒకటి. అదే జరిగితే పార్టీ మెరుగుపడే అవకాశాలు శూన్యం. మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు.

ఇక రెండో సినారియో, వాళ్లు నిజంగానే పార్టీ అధ్యక్షపీఠం స్వీకరించడానికి సిద్ధంగా లేక, గాంధీ–నెహ్రూ కుటుంబేతరులెవరికైనా అధ్యక్ష స్థానాన్ని అప్పగించడం. అదికూడా, కుర్చీని నామమాత్రంగా ఇచ్చి, పీఠంపై కూర్చోబెట్టినంత మాత్రాన సరిపోదు. జోక్యాలు లేకుండా, ప్రస్తుత అవసరాలు, పరిస్థితులకు తగ్గట్టు కొత్త అధ్యక్షుడెవరైనా స్వేచ్ఛగా–స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం ఆ కుటుంబం కల్పిస్తుందా? అనేది ముఖ్యం. అప్పడుగాని రెండో సినారియోను ఆశించే వారి లక్ష్యం నెరవేరదు. కుటుంబ, వారసత్వ రాజకీయాలంటూ పదే పదే కాంగ్రెస్ పై బీజేపీ చేసే విమర్శను కట్టడి చేయడానికీ ఇది పనికొస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త పంథా, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల ప్రకటన వంటి చర్యలతో కాంగ్రెస్​ను మెరుగుపరచడానికి ఈ సినారియో ఉపయోగపడొచ్చు!

మార్పుతోనే మనుగడ
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాల్చే సమ్మోహన శక్తి ఇప్పుడు గాంధీ–నెహ్రూ కుటుంబానికి లేకుండా పోయింది. దానికి, స్వయంగా రాహుల్ గాంధీయే ఓడిపోవడానికి మించిన తార్కాణం ఏముంటుంది. అందువల్ల, ఎన్నికల గోదారి ఈది, గట్టెక్కడానికి సదరు కుటుంబం పేరు–ప్రఖ్యాతులు ఇప్పుడు సరిపోవటం లేదు! 2014 నుంచి ఏ ప్రధాన ఎన్నికా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడమే నిదర్శనం. అలా అని, ఆ కుటుంబానికి పార్టీ దూరమైతేనో, వారే స్వయంగా దూరం జరిగి అంటీ ముట్టనట్టుంటేనో, దేశంలో కాంగ్రెస్ ఐక్యత కష్టమనే శ్రేణులు భావిస్తాయి.అప్పుడు ఎన్నికలు గెలవటమనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా? అని అభిమానుల సందేహం! ఈ సంకట స్థితి నుంచి కాంగ్రెస్ బయటపడాలి. బయటకు గొంతెత్తక పోయినా, రాహుల్ వ్యవహార శైలి నచ్చని వారి సంఖ్య ఎక్కువే!

బీజేపీ లాంటి బలమైన రాజకీయ శక్తిని ఎదుర్కొనే పార్టీ మూడున్నరేళ్లు అధ్యక్షుడు లేకుండా ఉండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. అధ్యక్ష బాధ్యతలు వద్దనే రాహుల్ నిర్ణయాలన్నీ తాను తీసుకోవడమో, తన కనుసన్నల్లో జరగటమో కావాలంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న హిమంత బిశ్వశర్మ వంటి నేత కలవడానికి వస్తే, అపాయింట్​మెంట్ ఇవ్వకుండా కుక్కపిల్లలతో ఆడుకోవడం, పార్టీ రోజు రోజుకు కుంగిపోతున్న తెలంగాణ వంటి రాష్ట్రానికి వచ్చి సమీక్షలు జరుపకుండా చట్నీస్​కు, బావర్చీ బిర్యానీలకు వెళతానంటే మీడియాలో చూసే వారికి బాగుంటుందేమో కానీ, పార్టీకి ఏమాత్రం మేలు చేయదు. దేశ ప్రజలు క్లిష్ట సమస్యల్లో ఉన్నపుడు కూడా ‘సబటికల్ లీవ్’తో రహస్య స్థావరాలకు వెళ్లటం.. వంటివి  ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలరనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించజాలవు!

అప్పుడే ఎందుకు స్పందించలే?
గాంధీ–నెహ్రూ కుటుంబ, నేతల కోటరీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆజాద్​ పాత్ర కాంగ్రెస్​లో ఎంత? ‘‘తోటకూర నాడే చెంపదెబ్బ వేసుంటే..”అన్న సామెత చందంగా, ఆజాద్ లాంటి సీనియర్లు, పార్టీలో తప్పిదాలు జరుగుతున్నపుడే ఎత్తి  చూపాల్సింది. సొంత సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్​ను ‘నాన్సెన్స్’ అని పబ్లిక్​గ్గా రాహుల్ చింపినపుడు గానీ, తర్వాత పార్టీ అంతర్గత వేదికల్లో గానీ ఆజాద్ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అని విమర్శ సహజం. పదవి,  అధికారం కోసం అప్పుడు మౌనంగా ఉండి, రాజ్యసభ టర్మ్ కొనసాగించనందుకు ఇప్పుడు పార్టీ వీడి, విమర్శించడం ఆజాద్ తప్పిదమనే వాళ్లూ ఉన్నారు.

- సవ్యసాచి