కేజ్రీవాల్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ పర్వేశ్​ వర్మ

కేజ్రీవాల్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ పర్వేశ్​ వర్మ

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ను ఓడించి బీజేపీ నేత పర్వేశ్ వర్మ "జెయింట్​ కిల్లర్​" గా అవతరించారు. కేజ్రీవాల్​కు మొత్తం 25,999 ఓట్లు పోలవగా.. పర్వేశ్ వర్మ 30,088 ఓట్లు సాధించి 4,089 ఓట్ల మెజార్టీని పొందారు. కేజ్రీవాల్ కంచుకోట అయిన న్యూఢిల్లీలోనే ఆయనను మట్టికరిపించి పర్వేశ్ వర్మ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు.  

బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకే ఈ పర్వేశ్ వర్మ. దేశ రాజధానిలోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో ఒకరు. 1977 నవంబర్ 7న జన్మించిన వర్మ..1991లో స్వయంసేవక్‌‌‌‌‌‌‌‌గా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. బీజేపీ యువ మోర్చాలో చేరి దాని జాతీయ కార్యనిర్వాహక సభ్యుడయ్యారు. అనంతరం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

తొలిసారి 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌‌‌‌‌‌‌‌పై మెహ్రౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో పశ్చిమ ఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీ అయ్యారు. 2019లో మళ్లీ పశ్చిమ ఢిల్లీ లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానానికే పోటీ చేసి 5.78 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన వర్మ.. తన తండ్రి స్థాపించిన "రాష్ట్రీయ స్వాభిమాన్" అనే లాభాపేక్షలేని సంస్థ ద్వారా సామాజిక సేవలో పాల్గొంటున్నారు. 

2024 ఎన్నికల్లో లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ, ఈ ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌తో తలపడి గెలిచారు. కేజ్రీవాల్ ను ఓడించిన "జెయింట్ స్లేయర్"గా అవతరించారు. ఆయన ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులోనూ ముందు వరుసలో నిలిచారు.