
ఐపీఎల్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ కు రాజస్థాన్ రాయల్స్ సోమవారం (ఏప్రిల్ 28) బిగ్ షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ లో 209 పరుగుల భారీ స్కోర్ చేసి ఇక విజయం ఖాయమనుకున్న దశలో 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ధాటికి గుజరాత్ కుదేలైంది. ఆట ప్రారంభం నుంచి వైభవ్ చెలరేగి ఆడుతూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి గుజరాత్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. సూర్యవంశీ ధాటికి రాజస్థాన్ ఈ మ్యాచ్ లో మరో 25 బంతుల్లో మిగిలి ఉండగానే 210 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో గిల్ కెప్టెన్సీ చేయలేదు.
టాస్ ఓడి గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ కు దిగగా.. గిల్ 50 బంతుల్లోనే 84 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రెండో ఇన్నింగ్స్ లో గిల్ డగౌట్ లో కూర్చొని మ్యాచ్ చూస్తూ కనిపించాడు. గిల్ స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్సీ చేశాడు. మ్యాచ్ ముగిసేవరకు గిల్ డగౌట్ లోనే ఉన్నాడు. శుభమాన్ లేకపోవడం జట్టు పరాజయంపై ఫలితం చూపించింది. అయితే గిల్ ఎందుకు కెప్టెన్సీ చేయలేదో మ్యాచ్ తర్వాత వివరణ ఇచ్చాడు. తన వీపు నొప్పి ఉన్న కారణంగానే తాను బరిలోకి దిగలేదని చెప్పాడు.
►ALSO READ | Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే 15 రికార్డులు ఔట్.. వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేసిన రికార్డులివే!
మ్యాచ్ తర్వాత గిల్ మాట్లాడుతూ.. " నా వీపుపై కొంచెం నొప్పిగా అనిపించింది. మాకు రెండు రోజుల తర్వాత మ్యాచ్ ఉంది. నేను రిస్క్ తీసుకోకూడదని ఫిజియో చెప్పాడు. రాజస్థాన్ పవర్‌ప్లేలో మా నుండి ఆటను లాగేసుకున్నారు. వారికే పూర్తి క్రెడిట్ దక్కుతుంది. విజయానికి వారు పూర్తి అర్హులు. ఈ రోజు వైభవ్ సూర్యవంశీది. అతను అద్భుతంగా ఆడాడు. మాకు ఈ మ్యాచ్ లో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. మేము జట్టుగా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి". అని గుజరాత్ కెప్టెన్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్ ను శుక్రవారం (మే 2) సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆడనుంది.
Nothing but a LEADER taking all the blame - who was not there because of back spasm #ShubmanGill #RRvsGT pic.twitter.com/wEk7Lb12T2
— Rohit Juglan (@rohitjuglan) April 28, 2025