- వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
బషీర్ బాగ్, వెలుగు: ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ రూ. కోట్లలో పెట్టుబడులు పెట్టించుకొని బ్రాహ్మణులను మోసగించిందని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ మండిపడ్డారు. ఇటీవల బెయిల్ పై బయటకి వచ్చిన ఫౌండేషన్ చైర్మన్ కమలాకర్ శర్మ ఆస్తులను అమ్మేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. ధన్వంతరి కేసును సీసీఎస్ నుంచి సీఐడీకి బదిలీ చేసి సిట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ధన్వంతరి స్కామ్ పెద్దదని, సుమారు 3 వేల మంది బాధితులు ఉన్నారని, రూ. వెయ్యి కోట్లు మోసం చేసిందని ఆరోపించారు. కమలాశర్మ ఆస్తులను అమ్మకాలు జరగకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, నిందితుడి పాస్ పోర్ట్, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.