‘గిరిజన బంధు’ ఏమైంది?

ప్రజాస్వామ్యంలో ఎవరైనా జాతీయ పార్టీ పేరుతో పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. ‘జాతీయ పార్టీ’ అనే గుర్తింపు మాత్రం ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా నుంచి రావాల్సిందే. అయితే కేసీఆర్​ దాదాపు మూడు ఏండ్లు ఫ్రంట్​ల పేరుతో వివిధ ఫార్మాట్లను పరిశీలించి చివరకు దేశంలో ‘గుణాత్మక మార్పు’ రావాలని టీఆర్​ఎస్​ను బీఆర్ఎస్​గా మార్చారు. 2001లో టీఆర్​ఎస్​ పెడుతున్న సందర్భంలో తెలంగాణ ఏర్పడితే ‘గణనీయమైన మార్పు’ వస్తుందన్నారు. తెలంగాణ వచ్చింది..ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చెప్పినట్టు గత 9 ఏండ్లలో గణనీయమైన మార్పూ వచ్చింది. అదేమిటంటే, యువత ఉపాధి లేక వ్యసనాలకు బానిస అవుతున్నది. పేదలు మరింత పేదలవుతున్నారు. సామాజిక న్యాయం లేదు, అధికారం కొందరికే పరిమితమైంది. యూత్​ పాలసీ, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఓ పాలసీ రూపొందించిన దాఖలాలు లేవు. యువత జనాభా పెరుగుతున్నప్పుడు వారికి తగ్గట్టు పాలసీ ఉండాలి కదా! మరి ఎందుకు రూపొందించలేదు? 

ఏపీలో రాజకీయం..

ఆంధ్ర రాష్ట్రానికి బీఆర్ఎస్ ​అధ్యక్షుడిని నియమించిన సందర్భంలో ‘రూ.1.45 లక్షల కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా ఏటా రైతులకు ఉచిత విద్యుత్​ఇస్తాం’ అని కేసీఆర్​ ప్రకటించారు. విద్యుత్​ అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్​.. ఇప్పటికీ తెలంగాణ వాడుతున్న కరెంట్​లో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న కరెంట్​ఉన్నదన్న విషయం మరిచిపోయారా? విద్యుత్​ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించక, అవి అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలియదా? అదీగాక రాష్ట్రంలో విద్యుత్​ సరఫరా నష్టాలన్నీ రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్​లో జమచేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉచిత విద్యుత్​ అవసరం ఎంత ఉంది? అరడజను​కు పైగా రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్​అవసరమే లేదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల నైసర్గిక, భౌగోళిక పరిస్థితులు వేరు. వ్యవసాయ ఉత్పత్తులు కూడా తక్కువే. బహుశా ఆంధ్రా ప్రజలకు చేరేందుకు ఆయన ఉచిత విద్యుత్​ అంశాన్ని ప్రస్తావించి ఉండొచ్చు. అయితే ‘లంకలో పుట్టిన వారంతా రాక్షసులే’ అనే మాటలు గుర్తుంచుకున్న ఆంధ్రా ప్రజలు ఇప్పుడు కేసీఆర్​మాటలను ఎంత వరకు నమ్ముతారు అనేది ప్రశ్నే!

దళితులకు పూర్తి న్యాయం జరిగిందా?

హుజూరాబాద్​ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ పథకం తీసుకొచ్చారు. ఈ పథకాన్ని తెలంగాణలోనే పూర్తి స్థాయిలో అమలు చేయని కేసీఆర్.. బీఆర్ఎస్​ పార్టీ ద్వారా దేశంలో అమలు చేస్తరట. బీఆర్ఎస్​పార్టీకి ఈ వాగ్దానం మైలేజ్​ తీసుకువచ్చే మాటే కావొచ్చు, కానీ ప్రజలకు మాత్రం ఉపయోగం లేనిది. రాష్ట్ర జనాభాలో15 శాతం ఉన్న దళితులకు ఇప్పటి వరకు ఎంత న్యాయం జరిగింది? దళితుల్లో అత్యధిక శాతం ఉన్న మాదిగలకు రాజ్యాధికారంలో ఎంత వాటా దక్కిందో తెలిసిందే. ఇది చాలదు అన్నట్లు ఆంధ్రప్రదేశ్​లో దళితులు, దేశంలోని దళితుల కోసం ‘దళిత బంధు’ అనే పల్లవి అందుకున్నారు. కేసీఆర్​ మాటలను నమ్మడానికి ఆంధ్రాప్రజలు, ముఖ్యంగా దళితులు సిద్ధంగా లేరు. వాళ్లు తెలంగాణ వారితో పోలిస్తే చదువులో, రాజ్యాధికారంలో కొంత ముందే ఉన్నారు. కేసీఆర్​ మాటలు విని మోసపోరు. ఏది ఏమైనా కేసీఆర్​ ఒక వాగ్దానం చేసి, దాన్ని త్వరలోనే అమలు చేస్తామని చెబుతూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం, ఓట్లు వేయించుకోవడం సాధారణమైపోయింది.

గిరిజనుల ఓట్ల కోసం..

తెలంగాణలో గిరిజనులకు12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్.. నిరుడు ఏ సందర్భంలో 10 శాతం రిజర్వేషన్​ ఇచ్చారో చూశాం.​ సెప్టెంబర్​ నెలలో అమిత్​షా మీటింగ్, మునుగోడు ఎన్నికల సందర్భంలో వివిధ రాజకీయ కారణాల వల్ల తప్పని పరిస్థితుల్లో ఆ ప్రకటన చేశారు. అదే సమయంలో ప్రస్తావించిన ‘గిరిజన బంధు’ ఎటుపోయినట్టు? అది మునుగోడులో గిరిజనులు ఓట్ల కోసం చేసిన వాగ్దానమే తప్ప.. నిజంగా గిరిజనులను ఉద్ధరించాలని కాదు! మునుగోడు ఎన్నికల కోసమే అప్పటికప్పుడు ‘గిరిజన కార్పొరేషన్’ చైర్మన్​గా అదే జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించారు. కేసీఆర్​నిజంగా గిరిజనుల అభివృద్ధి కోరేవారే అయితే.. రాష్ట్ర జనాభాలో10 శాతం ఉన్న గిరిజనుల భాష, లిపి, సంస్కృతి పరిరక్షణ కోసం ఏదైనా చేయొచ్చు కదా! రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను కల్పించవచ్చు కదా! కానీ అవేమీ చేయలేదు. కేవలం ఓట్లు, సీట్ల కోసం అప్పుడు ‘గిరిజన బంధు’ ప్రతిపాదన తెరమీదకు తెచ్చి, ఇప్పుడు మరిచిపోయారు.
- పృథ్వి కుమార్​ చౌహాన్,
రీసెర్చ్​ స్కాలర్