ఆదివాసులను, గిరిజనులను మోసం చేయడానికే గిరిజన బంధు

తెలంగాణలో దోపిడీ పాలన, గడీల పాలన పోతేనే బహుజనల బతుకులు మారుతాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామంలో పర్యటించిన ప్రవీణ్ కుమార్.... ఆదివాసులను, గిరిజనులను మోసం చేయడానికే గిరిజన బంధు పథకమన్నారు. 2014, 18 ఎన్నికల్లో కేసీఆర్ కు గిరిజనులు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నిక కోసమే గిరిజన బంధు పథకం తీసుకొచ్చారని ఆరోపించారు.

నిరుద్యోగులను మోసం చేయడానికే గిరిజనులకు 10% రిజర్వేషన్ అన్న ఆయన... గిరిజనులు, ఆదివాసుల మీద గౌరవం ఉంటే ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నుకుంటుంటే అగ్రవర్ణ నాయకుడు యశ్వంత్ సిన్హాను ఎందుకు ఆహ్వానించారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో యువకులను తాగుబోతులుగా మారుస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకురావాలని డిమాండ్ చేశారు. 8సం.రాల నుండి టీఆర్ఎస్ చేస్తున్న దోపిడీ పాలన గురించి ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.