గిరీష్ కర్నాడ్ అన్నింట్లో ఆల్ రౌండర్.!

గిరీశ్‌‌ కర్నాడ్‌‌ గురించి రాయడం మొదలుపెడితేఆయన ఎవరని రాయాలిరచయిత, నాటక ప్రయోక్త, యాక్టర్‌‌డైరెక్టర్‌‌, ఆర్టిస్టు, పెయింటర్‌‌, నేచర్​ లవర్‌‌ ఇలా ఎన్నో మల్టిపుల్‌‌ టాలెంట్స్‌‌ కనిపిస్తాయి. నాటక సాహిత్యంలో జ్ఞానపీఠ్‌‌అవార్డు అందుకున్నారుపుణే ఫిలిం ఇనిస్టిట్యూట్‌‌ డెరెక్టర్‌‌గా మెరికల్లాంటి నటీనటులను తయారు చేశారు. ఆయన ద్వారా వెండితెరకు పరిచయమైన నటీనటులు, టెక్నీషియన్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారుదాదాపు 35 ఏళ్ల క్రితం వచ్చిన ఆనందభైరవిసినిమాతో తెలుగువారికి చేరువయ్యారు. సోమవారం ఆయన తన జ్ఞాపకాలు మిగిల్చి కన్నుమూశారు.

అమ్రిష్‌‌ పురి, ఓం పురి, విష్ణువర్ధన్‌‌, శంకర్‌‌ నాగ్‌‌, శేఖర్‌‌ సుమన్‌‌, సోనాలి కులకర్ణి, కెమెరామెన్‌‌ రాజీవ్‌‌ మీనన్‌‌, ఆర్ట్‌‌ డైరెక్టర్‌‌ సబూ సిరిల్‌‌, సింగర్‌‌ కవిత కృష్ణమూర్తి… వీళ్లందరూ ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని ప్రముఖులు. వీళ్లందరిలోనూ టాలెంట్‌‌ గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి గిరీశ్‌‌ కర్నాడ్‌‌. నాటక రచయిత, సినిమా రైటర్‌‌, డైరెక్టర్‌‌, చిత్రకారుడు… అన్నిటికీ మించి అద్భుత నటుడు గిరీశ్‌‌. ఆయన పేరు 1970-–90 మధ్య కాలంలో సినీ, నాటక, సాహిత్య రంగాల్లో మారుమోగింది. తెలుగువారికి జంధ్యాల తీసిన ‘ఆనందభైరవి’ సినిమాద్వారా చాలా దగ్గరయ్యారు. తన మెయిన్‌‌స్ట్రీమ్‌‌ సాహిత్యం నాటకం కావడంతో ఆయన నటించిన సినిమాలు చాలా తక్కువ. మాతృభాష కన్నడతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తంగా 90 సినిమాల వరకు నటించారు.వీటిలో కమర్షియల్‌‌ సినిమాలకంటే సోషల్‌‌ ఇష్యూస్‌‌పై తీసినవే ఎక్కువగా ఉంటాయి. ఇండియన్‌‌ కల్చరల్‌‌ పాలసీని రూపొందించడంలో ఆయనదే కీలక పాత్ర.

గిరీశ్‌‌ కర్నాడ్‌‌ విద్యార్థి దశలో కవి కావాలని అనుకున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో యక్షగానాల ప్రభావం ఎక్కువ. తన బాల్యం గడిచిన సిర్సి (మహారాష్ట్ర) గ్రామంలోనూ, ఆ తర్వాత ధార్వాడ్‌‌ (కర్ణాటక)లో గడిపిన కాలేజీ జీవితంలోనూ యక్షగానాలనుంచి చాలా స్ఫూర్తి పొందారు. బాల్యంలోనే పురాణాలు, ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని చదివారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌‌లో బీఏ (మ్యాథ్స్‌‌) చదవడానికి వెళ్లారు. నిజానికి ఆయన లెక్కల్లో జెమ్‌‌ అయినప్పటికీ, అవంటే మహా చిరాకు. కానీ, స్కాలర్‌‌షిప్‌‌ ఉంటేనే చదివిస్తానని తండ్రి చెప్పడంతో… తప్పనిసరిగా లిటరేచర్‌‌ జోలికెళ్లకుండా మ్యాథ్స్‌‌ తీసుకున్నట్లుగా కే.ఎం.చైతన్య తీసిన ఒక డాక్యుమెంటరీలో స్వయంగా గిరీశ్‌‌ చెప్పుకొచ్చారు. 1960లో సహ విద్యార్థినితో ఫస్ట్‌‌ క్రష్‌‌ ఏర్పడితే, తండ్రి ససేమిరా ఒప్పుకోలేదు. ఇండియా వచ్చేయమన్నారు.  తన చదువు, భవిష్యత్తు వంటి విషయాలేవీ తన ప్రమేయం లేకుండానే తండ్రి నిర్ణయించడంపై కలిగిన ఆలోచనలతో ‘యయాతి’ అనే నాటకాన్ని రాశారు. దానిని తమ సొంతూరు ధార్వాడ్‌‌ (కర్ణాటక)లోని మనోహర గ్రంథమాలకు పంపించారు. ఆ నాటకం ప్రచురితం కావడమే కాక, ఎన్నో ప్రదర్శనలకుకూడా నోచుకుంది. ‘యయాతి’కే​ జ్ఞాన్​పీఠ్​ అవార్డు అందుకున్నారు. ఆనాటి నుంచి ఆయన చివరి ఘడియల వరకు ఆ పబ్లిషింగ్‌‌ హౌస్‌‌తో అనుబంధం కొనసాగింది.

గిరీశ్‌‌ కర్నాడ్‌‌ రాసిన నాటకాల్లో బాగా ఆడియన్స్‌‌ ప్రశంసలను అందుకున్నవాటిల్లో యయాతి, హయవదన, తుగ్లక్‌‌, టిప్పు సుల్తాన్‌‌ వంటివి ఉన్నాయి. ఆయన సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఎస్‌‌.ఎల్‌‌.భైరప్ప రాసిన ‘వంశవృక్ష’ నవలను అదే పేరుతో కన్నడలో సినిమాగా డైరెక్ట్‌‌ చేశారు. 1971లో తీసిన వంశవృక్ష ద్వారానే విష్ణువర్దన్‌‌ వెండితెరకు పరిచయమయ్యారు. విష్ణు తర్వాత కన్నడ సూపర్‌‌ స్టార్‌‌గా ఎదిగారు.  ఆ తర్వాత 1972లో అమ్రిష్‌‌ పురి, నందిని భక్తవత్సల మెయిన్‌‌ క్యారెక్టర్లుగా ‘కాడు’ సినిమా తీశారు. నందినికి నేషనల్‌‌ బెస్ట్‌‌ యాక్ట్రెస్‌‌ అవార్డు వచ్చింది. 1978లో తాను డైరెక్ట్‌‌ చేసిన ‘ఒందానొందు కాలదల్లి’ సినిమాలో శంకర్‌‌ నాగ్‌‌ని పరిచయం చేశారు. జపనీస్‌‌ డైరెక్టర్‌‌ అకిరా కురసోవా ప్రభావంతో తీసిన ఈ సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులొచ్చాయి.  శంకర్‌‌ నాగ్‌‌కూడా తర్వాతి కాలంలో మంచి డైరెక్టర్‌‌గా ఎదిగి, ఆర్‌‌.కె.నారాయణ్‌‌ రాసిన ‘మాల్గుడి డేస్‌‌’ని దూరదర్శన్‌‌కోసం సీరియల్‌‌గా తీశారు. గిరీశ్‌‌ కర్నాడ్‌‌ తీసినవాటిల్లో చెప్పుకోదగ్గ మరో రెండు సినిమాలు ‘ఉత్సవ్‌‌ (హిందీ)’, ‘చెళువి (కన్నడ)’.

సంస్కృత నాటక రచయిత శూద్రకుడు రాసిన ‘మృచ్ఛకటికం’ని ప్రఖ్యాత హిందీ నటుడు శశికపూర్‌‌ తన సొంత బేనర్‌‌పై ‘ఉత్సవ్‌‌’గా గిరీశ్‌‌ దర్శకత్వంలో తీయించారు. దీనిలో ప్రస్తుతం ప్రముఖ టీవీ హోస్ట్‌‌గా రాణిస్తున్న శేఖర్‌‌ సుమన్‌‌ని పరిచయం చేశారు గిరీశ్‌‌. తాను నటించిన టాప్‌‌–5 బెస్ట్‌‌ మూవీస్‌‌లలో ‘ఉత్సవ్‌‌’కూడా ఒకటని చెబుతుంటారు సీనియర్‌‌ బాలీవుడ్‌‌ నటి రేఖ. ఆమె కెరీర్‌‌లో ఉమ్రావ్‌‌ జాన్‌‌, ఉత్సవ్‌‌ రెండూ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘ఉత్సవ్‌‌’కి బెస్ట్‌‌ ఆర్ట్​  డైరెక్షన్‌‌తోపాటు ఉత్తమ గాయనిగా అనురాధ పాడ్వాల్‌‌కి జాతీయ అవార్డులు వచ్చాయి.

ఇక, ‘చెళువి’ సినిమా పూర్తిగా ప్రకృతి, పర్యావరణం, మానవాళి మనుగడ అనే అంశాల ఆధారంగా తీసినది. ఒక యువతి తనకున్న అద్భుత శక్తితో చెట్టుగా మారిపోతుంది. వివాహం తర్వాత భర్త ఎదుట చెట్టుగా మారిపోయి మంచి పరిమళ పుష్పాలు పూయిస్తుంది. ఈ వింతను చూసిన మరదలు పంతంతో  ఆమెను చెట్టుగా మారమని కోరుతుంది. మరదలి స్నేహితులు ఆకతాయితనంతో చెట్టుపైకెక్కి కొమ్మలు విరిచేస్తారు. ప్రకృతిని విధ్వంసం చేస్తే మిగిలేది వినాశనమే అన్న సందేశంతో ఈ సినిమా తీశారు గిరీశ్‌‌ కర్నాడ్‌‌.

ఆయన రాసిన నాటకం ‘నాగమండల’ని టి.ఎస్‌‌.నాగాభరణ అదే పేరుతో సినిమాగా తీశారు. దీనిలో క్యారెక్టర్‌‌ యాక్టర్‌‌ ప్రకాశ్‌‌ రాజ్‌‌ నటించారు. తనను పట్టించుకోని భర్తలో మార్పు తేవాలని మూలికలు కలిపిన పాలను  భార్య సిద్ధం చేస్తుంది. అవి ఒలికిపోగా ఒక నాగుపాము తాగుతుంది. మూలికల ప్రభావంతో నాగుపాము ప్రకాశ్‌‌రాజ్‌‌లా మారిపోయి ఆమెతో ప్రేమలో పడుతుంది. ఇవేమీ తెలియని భార్య నాగుపామునే భర్తగా భావిస్తుంది. తీరా గర్భవతి అయ్యేసరికి అసలు భర్త గొడవపడతాడు. పాము పడగపై ప్రమాణం చేసి, తనకు భర్త తప్ప మరొకరు తెలియదని ఆమె చెబుతుంది. ఈ సినిమాలో మానవ సంబంధాల విలువను, భార్యభర్తల అనుబంధాన్ని చక్కగా వివరించారు గిరీశ్‌‌.

గిరీశ్‌‌ కర్నాడ్‌‌ని కేవలం సినీ నటుడు, దర్శకుడుగానే గుర్తుంచుకుంటే… ఆయనలోని మల్టిపుల్‌‌ టాలెంట్‌‌కి అన్యాయం చేసినట్లే అవుతుంది. గిరీశ్‌‌ గొప్ప మానవతావాది. మతం పేరుతో జరిగే హింసాకాండను ఆయన  చాలా వేదికలపై ఖండించారు. అంతమాత్రాన అతనేమీ నాస్తికుడు కాడు. స్వయానా శివభక్తుడు. ధార్వాడ్‌‌లోని చారిత్రక సోమేశ్వరస్వామి ఆలయాన్ని తరచు సందర్శించేవారు. ఆ ఆలయాన్ని మహా శిల్పి జక్కన కట్టించారని చెబుతారు. ఆలయం పక్కనుంచి ప్రవహిస్తున్న షాల్మలి  నది అంటే చాలా ఇష్టం.  కన్నడ రచయిత ఎం.ఎం.కాల్బుర్గి, హేతువాదులు నరేంద్ర దాభోల్కర్‌‌, గోవింద్‌‌ పన్సారేలపై హత్యాకాండను, దాద్రిలో జరిగిన దాడులను గిరీశ్‌‌ ఖండించారు. తనను వ్యతిరేకించినవారినిసైతం ప్రేమించడం గిరీశ్‌‌ కర్నాడ్‌‌లోని మరో కోణం. హ్యూమనిస్టు, లిరిసిస్ట్‌‌, ప్లే రైటర్‌‌, యాక్టర్‌‌, డైరెక్టర్‌‌గానే కాకుండా అత్యున్నతమైన ‘జ్ఞానపీఠ్‌‌’ పురస్కారాన్నికూడా పొందిన గిరీశ్‌‌ తన జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయారు.