కేరళలోని పతనంతిట్ట జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. క్రీడాకారిణి అయిన ఓ మైనర్ బాలికపై ఐదేళ్లలో 60 మందికి పైగా అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఆమె కోచ్, తోటి అథ్లెట్లు, క్లాస్‌మేట్స్‌తో సహా పలువురు యువకులు ఉన్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
బాలిక ప్రవర్తన, కౌన్సెలింగ్‌పై బాలిక ఉపాధ్యాయురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి నివేదించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక వాంగ్మూలం ఆధారంగా నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకూ 44 మంది అనుమానితులను గుర్తించారు. బాలిక వాంగ్మూలం ప్రకారం.. అనుమానితులతో కమ్యూనికేట్ చేయడానికి ఆమె తన తండ్రి మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సదరు ఫోన్ నెంబర్ల వివరాలు, బాలిక వద్ద ఉన్న డైరీలోని సమాచారాన్ని పరిశీలించిన తర్వాత 44 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ | కాలుతో తొక్కి చంపేశాడు.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. లైంగిక వేధింపుల కేసులో 60 మందికి పైగా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నారని భావిస్తున్నారు. వారి కోసం లుక్ అవుట్ నోటీసులు, ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు పరిశీలిస్తున్నట్లు డీఐజీ బేగం తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 13 మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు డీఐజీ పేర్కొన్నారు.
ప్రస్తుతం బాధితురాలికి 18 ఏళ్లు కాగా.. బాధితురాలు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి ఈ అఘాయిత్యాలు జరిగాయి. బాలికది పతనంతిట్ట జిల్లా కాగా.. జిల్లా వెలుపలి వ్యక్తులకు కూడా ఈ కేసులో ప్రమేయం ఉండవచ్చని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. బాలిక మైనర్‌గా ఉన్నప్పుడు ఈ ఘటనలు జరిగినందున, నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.