నారాయణపేట/ధన్వాడ, వెలుగు: ఆడపిల్లలు చదువుకునేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం నారాయణపేట సింగారం లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో స్త్రీ శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భేటీ బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. ప్రస్తుతం 250 మంది ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకోవడం హర్షణీయమన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి స్థిరపడేలా కృషి చేయాలన్నారు. అలాంటి వారిని ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. డీడబ్ల్యూవో వేణుగోపాల్, డీఈవో ఘని పాల్గొన్నారు. అంతకుముందు ధన్వాడ మండలంలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ఎంట్రీని పరిశీలించారు.