చికిత్స పొందుతూ బాలిక మృతి .. ప్రైవేట్ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

చికిత్స పొందుతూ బాలిక మృతి .. ప్రైవేట్ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన
  • డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యుల ఆందోళన

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని శివాజీనగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఓ బాలిక చనిపోగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన శ్రీకాంత్ చారి, స్వాతి దంపతుల కూతురు మాన్విత(4)కు జ్వరం రావడంతో ఈ నెల 15న హాస్పిటల్ కు తీసుకువచ్చారు. రెండు రోజులు డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వాడిన వాళ్లు 17 న పాపను హాస్పిటల్​లో అడ్మిట్ చేశారు. అనంతరం పాపకు న్యుమోనియా ఉందని లివర్ ఆపరేషన్ చేయాలని చెప్పిన డాక్టర్లు 24న ఆపరేషన్ చేశారు. అందుకు లక్షా ఇరవై వేలు తీసుకున్నారు. 

బుధవారం మధ్యాహ్నం వరకు బాగానే ఉన్న పాపకు డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫిట్స్ వచ్చి చనిపోయిందన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన 
విరమించారు.