భైంసా పట్టణంలో ఆపరేషన్​ వికటించి బాలిక మృతి

  • డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన

భైంసా, వెలుగు: భైంసా పట్టణంలోని సాయిసుప్రియ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​లో ఆపరేషన్​వికటించి ఓ బాలిక మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే బాలిక చనిపోయిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కుభీర్​ మండల కేంద్రానికి చెందిన పల్లవి (14) గత ఐదు రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో.. శుక్రవారం రాత్రి భైంసాలోని సాయి సుప్రియ హాస్పిటల్​కు తీసుకువచ్చారు.

స్కానింగ్​తీసి రిపోర్టుల ఆధారంగా సర్జరీ చేయాలని డాక్టర్​రజినీకాంత్​చెప్పడంతో కుటుంబీకులు అంగీకరించారు. దీంతో శుక్రవారం రాత్రి ఆపరేషన్ చేశారు. కానీ శనివారం ఉదయం 9గంటలకు బాలిక చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే బాలిక మృతి చెందిందని, సదరు డాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ కుటుంబసభ్యులు హాస్పిటల్​ముందు భైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న పట్టణ సీఐ రాజారెడ్డి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఆ తర్వాత వారు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.