బడికి పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో బాలిక చక్కర్లు

  • రెండు రోజులపాటు బస్సుల్లో బాలిక జర్నీ
  • గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

కరీంనగర్ సిటీలో ‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెండు రోజుల కింద కలకలం రేపిన 13 ఏండ్ల బాలిక మిస్సింగ్, రెస్క్యూ వివరాలు ‌‌‌‌కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌ ఏసీపీ కరుణాకర్‌‌‌‌రావు మీడియాకు వెల్లడించారు. కరీంనగర్‌‌‌‌కు చెందిన బాలిక పెద్దపల్లిలోని అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లింది. బుధవారం అక్కడ వాళ్ల తాతయ్య బస్సు ఎక్కించగా మధ్యాహ్నం కరీంనగర్‌‌‌‌లోని బొమ్మకల్‌‌‌‌ చౌరస్తా వద్ద దిగింది. ఆ‌‌‌‌ తర్వాత కనిపించకుండా పోయింది.‌‌‌‌ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీ అభిషేక్‌‌‌‌ మహంతి సూచనల మేరకు ఐదు టీమ్​లు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. బాలిక కరీంనగర్‌‌‌‌లో బస్సు దిగిన తర్వాత బస్టాండుకు ఆటోలో చేరుకుని తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్, జగిత్యాలకు‌‌‌‌ వివిధ బస్సుల్లో ప్రయాణించింది. 

జగిత్యాల వెళ్తుండగా ఓ యువకుడు ఆమెను గమనించాడు. ఆ తర్వాత ఆమె మిస్సయినట్లు సోషల్ మీడియాలో ఫొటోను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు జగిత్యాల, కోరుట్ల, మెట్‌‌‌‌పల్లికి వెళ్లి బస్టాండ్లు పరిసరాల్లోని సీసీ కెమెరాలు వెతికినా ఆచూకీ దొరకలేదు. బాలిక జగిత్యాల నుంచి  వరంగల్, అక్కడ నుంచి నిజామాబాద్‌‌‌‌కు, మళ్లీ హైదరాబాద్‌‌‌‌కు గురువారం అర్ధరాత్రి చేరుకుంది. అక్కడ వెతుకుతున్న కరీంనగర్‌‌‌‌ పోలీస్​ టీమ్​కు ఒక ఆటో డ్రైవర్‌‌‌‌ బాలికను చూసి విషయం చెప్పగా పోలీసులు ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలి

పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలని ఏసీపీ కరుణాకర్​రావు సూచించారు. ఈ ఘటనలో ఇంటికి వెళ్తే తిరిగి స్కూల్‌‌‌‌కు పంపిస్తారని బాలిక ఇంటికి వెళ్లలేదని చెప్పారు. పిల్లలతో ప్రేమగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. ప్రేమగా మాట్లాడితే వారు అన్ని విషయాలను తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారని చెప్పారు.