బాలిక ఫిర్యాదు: మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి

బాలిక ఫిర్యాదు: మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి

గ్వాలియర్: ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాల్లో టాయిలెట్ల అపరిశుభ్రత గురించి వినే ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను సర్కారు ఎన్నిసార్లు ఆదేశించినా పరిస్థితుల్లో పెద్దగా  మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారో మంత్రి. తమ పాఠశాలలో మరుగుదొడ్లు క్లీన్ గా లేవంటూ మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రభుత్వ స్కూలులో చదవుతున్న ఓ బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్.. తానే స్వయంగా రంగంలోకి దిగి చీపురు పట్టి బాత్రూంలను క్లీన్ చేశారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విషయంపై ప్రధుమాన్ సింగ్ స్పందిస్తూ.. టాయిలెట్స్ బాగోలేవని బాలిక చెప్పడంతో స్కూలుకు వచ్చానని.. పిల్లల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతన్నారు. కాగా, స్వచ్ఛత విషయంలో ప్రధుమాన్ సింగ్ ఎప్పుడూ ముందుంటారు. ఇంతకుముందు ఓసారి గ్వాలియర్ కమిషనర్ ఆఫీసు విజిట్ కు వచ్చినప్పుడు కూడా మహిళా అధికారి టాయిలెట్స్ గురించి కంప్లయింట్ చేయడంతో ఆయన క్లీనింగ్ స్టాఫ్ తో కలసి మరుగుదొడ్లను పరిశుభ్రం చేశారు.