- ప్రిన్సిపాల్, సిబ్బందే కారణమంటూ దాడికి యత్నించిన బంధువులు
- దవాఖాన వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
- సూర్యాపేట జిల్లా దోసపాడులో ఘటన
పెన్ పహాడ్, వెలుగు: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపాడు పూలే బీసీ బాలికల గురుకుల స్కూల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. సిబ్బంది కథనం ప్రకారం..నూతనకల్ మండలంలోని మాచనపల్లికి చెందిన కొంపెల్లి సోమయ్య, నవ్య దంపతుల బిడ్డ సరస్వతి(10) గురుకులంలో ఐదో తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటోంది.
ఉదయం ఆరు గంటలకు జ్వరం వచ్చిందంటూ స్కూల్లోని నర్స్ వద్దకు వచ్చింది. జ్వరం ఎక్కువగా ఉండడంతో ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లగా ఫిట్స్ వచ్చాయి. తర్వాత సూర్యాపేటలోని ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయించగా చనిపోయింది.
ప్రైవేట్ కు తీసుకువెళ్లమని చెప్పినా వినలే..
సరస్వతి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉదయం తమ కూతురుకి జ్వరంగా ఉందని పాఠాశాలకు వచ్చి తీసుకెళ్లాలని చెప్పారని, అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు రమ్మన్నారని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉంటే ప్రైవేట్ దవాఖానకు తీసుకువెళ్లమని చెప్పామని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. దవాఖాన దగ్గర ధర్నా విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో లీడర్లు జనరల్ హాస్పిటల్ వద్ద మృతురాలి తల్లిదండ్రులకు మద్దతుగా ఆందోళనకు దిగారు.
అక్కడికి వచ్చిన ఆర్సీవో...ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, సిబ్బందితో మాట్లాడుతుండగా ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిపై బంధువులు దాడికి ప్రయత్నించారు. విద్యార్థి సంఘాల లీడర్లు మాట్లాడుతూ జ్వరం వచ్చిన రెండు గంటల్లోనే విద్యార్థిని మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. నిరక్ష్యంగా వ్యవహరించిన ఆర్సీవోను, ప్రిన్సిపాల్‌ను, జీఎన్ఎల్ఎంను సస్పెండ్ చేయాలన్నారు.
విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. దీంతో తక్షణ సాయంగా స్కూల్ నుంచి రూ. రెండు లక్షలు, మరో రూ.రెండు లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఆర్సీవో హామీ ఇచ్చారు. వినకపోవడంతో ఆర్డీవో వేణుమాధవరావు, ఆర్సీవో.. విద్యార్థి సంఘ నాయకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కాగా, ఘటనపై స్పందించిన మంత్రి వెంకట్ రెడ్డి విద్యార్థిని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.