పదేండ్ల పనిపిల్లపై పైశాచికం

  • ఢిల్లీలో ఓ పైలట్, ఆమె భర్త కలిసి దారుణం  

న్యూఢిల్లీ: పదేండ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకోవడమే కాకుండా.. ఆ చిన్నారిని మహిళా పైలట్, ఆమె భర్త కొట్టి హింసించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు.. పైలట్, ఆమె భర్తపై దాడి చేశారు. బుధవారం ఢిల్లీలోని ద్వారక ఏరియాలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కౌషిక్ బాగ్చి, పూర్ణిమ బాగ్చి దంపతులు. పూర్ణిమ ఇండిగోలో పైలట్​గా పని చేస్తుండగా, కౌషిక్ మరో ఎయిర్ లైన్స్ లో ఉద్యోగి. వీళ్లు ఓ మైనర్​ను 2 నెలల కింద ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. 

బుధవారం ఉదయం ఆ బాలికను పైలట్, ఆమె భర్త కొట్టారు. ఒంటిపై వాతలు పెట్టారు. ఇది తెలుసుకున్న బాలిక బంధువులు పైలట్ ఇంటికొచ్చి... భార్యాభర్తలపై దాడి చేశారు. దాడి సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి విడిపించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ ఇప్పించామని ద్వారక డీసీపీ చెప్పారు. పైలట్, ఆమె భర్తపై కేసు నమోదు చేశామన్నారు. .

ALSO READ : బెంగళూర్​లో ఉగ్రదాడులకు కుట్ర

డ్యూటీ నుంచి పైలట్ తొలగింపు.. 

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి  మలివాల్ స్పందిస్తూ ..‘మైనర్​ను పనిమనిషిగా పెట్టుకోవడం నేరం, బాలికను హింసించడం దారుణం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, పైలట్​ను డ్యూటీ నుంచి తాత్కాలికంగా తొలగించామని ఇండిగో ఎయిర్ లైన్స్​ పేర్కొంది.